Amaravaati, July 29: ఏపీలో కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ముంత్రులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) బాధ్యతలను అప్పజెప్పారు. ఇందులో భాగంగా మంత్రి శంకర్ నారాయణ (Malagundla Sankaranarayana) బుధవారం రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chellaboina venugopal krishna) రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు (Sidiri Appalaraju), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీలో పండగ వాతావరణం, కొత్తగా ఇద్దరు మంత్రులతో పాటు రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం, సీఎం పరిధిలో రెండు శాఖలు, గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు
కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్ నారాయణకు కేటాయించారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శంకర్ నారాయణ తూర్పుగోదావరి జిల్లాలోని ఎదుర్లంక- జి.ముళ్లపాలెం రహదారి కొత్త వంతెన పనులకు సంబంధించిన ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ్ మాట్లాడుతూ.. ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తనకు ఆర్ అండ్ బి శాఖ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల అమలులో తనను ముఖ్య భాగస్వామిని చేశారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు వేల కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు గాను రూ. 6400 కోట్లతో ఎన్డీబితో చేసుకున్న ఒప్పందంపై మొదటి సంతకం చేశానని పేర్కొన్నారు.
అదే విధంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లాలోని డోన్‌లో బాలికల రెసిడెన్సియల్ స్కూల్, బేతంచెర్లలో బాలుర రెసిడెన్సియల్ స్కూల్‌ను జానియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసే ఫైళ్లపై మంత్రి వేణుగోపాలకృష్ణ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. తను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన వరాలన పంచుతానని తెలిపారు.