Amaravati, Dec 27: యూకేలో కొత్త జన్యువును సంతరించుకున్న కరోనా వైరస్ కల్లోలం రేపుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆ దేశానికి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ నిషేధానికి ముందే భారతదేశానికి చాలామంది తిరిగివచ్చారు. ఏపీకి కూడా యూకె నుంచి వెళ్లిన వారు వచ్చిన నేపథ్యంలో వారికి పరీక్షలు నిర్వహించగా వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా (New Covid Strain in AP) నిర్ధారణ అయిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు.
అయితే అది ఇంకా కొత్త వైరస్ (New Covid Strain) అని నిర్ధారణ కాలేదని..వీరి శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపామని, రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. తూర్పు గోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరి చొప్పున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా గుంటూరులో ఇద్దరికీ కరోనా సోకిందని, వీరందరినీ కోవిడ్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త వైరస్ గురించి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, దాని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
యూకే నుంచి గత నెల రోజుల్లో 1214 మంది ఏపీకి రాగా ఇందులో 1158 మంది అడ్రస్‌లను గుర్తించినట్లుగా కాటంనేని భాస్కర్ (State Health Commissioner Katamaneni Bhaskar) వెల్లడించారు. వీరిలో ఇప్పటివరకు 1101 మంది క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. 56 మంది ప్రయాణీకుల అడ్రస్‌లు దొరకలేదని చెప్పారు. యూకే నుంచి వచ్చిన వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. యూకే నుంచి ఏపీకి వచ్చినవారు కరోనా టెస్ట్ చేయించుకోవడంతో పాటు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనలు సైతం పాటించాలని కోరారు.
గత 24 గంటల్లో ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కేవలం 282 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 442 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు 8,80,712 మంది కరోనా బారిన పడ్డారు. 7,092 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,700 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 8,69,920 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 42,911 మందికి కోవిడ్ టెస్టులు చేశారు.