VJY, Oct 19: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌ను నవంబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.
జైలులో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనుమానాలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని ఆయనకు జడ్జి సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు అందివ్వాలని జైలు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యంపై జడ్జి ఆరా తీశారు. ఆయన మెడికల్ రిపోర్టులను అందివ్వాలని ఆదేశించారు.ఇక జైల్లో ములాఖత్ లు పెంచాలని ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ వేశారు. రోజుకు మూడు సార్లు ములాఖత్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇక సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందని అందువల్ల బెయిల్ పిటిషన్‌పై మేం విచారణ జరపలేమని ఏపీ హైకోర్టు తెలిపింది. చంద్రబాబుకి వ్యక్తిగత డాక్టర్‌తో టెస్టులకు సంబంధించి లంచ్ తర్వాత విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా సుప్రీంలో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది నిజమేనా? అని హైకోర్టు న్యాయమూర్తి లూథ్రాను అడిగారు. చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్‌తో ఆయనకు పరీక్షలు జరిపేందుకు మీకేమైనా అభ్యంతరం ఉందా? అని పొన్నవోలును జడ్జి అడిగారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. గత 40 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారన్నారు. ఈ కేసులో ఇతర నిందితులు బెయిల్‌పై ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. గడిచిన 40 రోజులుగా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు.
ఫైబర్ నెట్ కేసు, చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై నిర్ణయం 20కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. చంద్రబాబు ఆరోగ్యంపై తాజా పరిస్థితి తెలుసుకునేందుకు మధ్యాహ్నం వరకు సమయం ఇవ్వాలని కోర్టును ఏఏజీ కోరారు. దీంతో న్యాయమూర్తి పిటిషన్‌పై విచారణను మధ్యాహ్నానికి పాస్ ఓవర్ చేశారు.