New Delhi, Jan 16: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో (Skill Development Scam Case) మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పులో (Supreme Court Verdict on Chandrababu Case) 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని జస్టిస్ బోస్ తీర్పును వెలువరించారు. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్‌ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదని తెలిపారు.
అయితే జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తీర్పును ఇచ్చారు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం.2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేమని తెలిపారు. అయితే ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు నిరాశ కలిగించే అంశమే. రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టు అంటే విజయవాడలోని ACB కోర్టుకు పూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇక సీజేఐకి చంద్రబాబు క్వాష్ పిటిషన్ బదిలీ అయింది.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ తనకు వర్తిస్తుందని.. ఆ సెక్షన్ ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనను అరెస్ట్ చేయడం అక్రమమని సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ(కాంగ్రెస్ నేత).. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, రంజిత్‌కుమార్‌లు వాదనలు వినిపించారు.
విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా ఇదిగో..
ఈ అంశంతో ముడిపడిన రెండు కేసుల విచారణ 17, 19వ తేదీల్లో సుప్రీం కోర్టులో జరగాల్సి ఉంది. ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది.