Vjy, Sep 12: టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. స్కిల్‌ స్కాంలో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబు హౌస్ రిమాండ్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.చంద్రబాబు లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించలేదు. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. బాబు తరపు న్యాయవాదులు వేసిన హౌస్ రిమాండ్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

పిటిషన్‌పై సోమవారం, మంగళవారం సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామని అదనపు ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. జైల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటున్నారని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని అన్నారు. రాజమహేంద్ర కేంద్రకారాగారంలో 50 అడుగుల ఎత్తైన గోడలు ఉన్నాయని అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు. ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉండటం వల్ల.. చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌కు అనుమతించవద్దని న్యాయస్థానాన్ని కోరారు.

వీడియో ఇదిగో, రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు, 30 నిమిషాల పాటు మాట్లాడేందుకు ములాఖత్‌

చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. ఆయనకు జైలులో ప్రమాదం పొంచి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కరుడుగట్టిన నేరస్థులు, ఆయుధాలు వాడిన నేరస్థులు అదే జైల్లో ఉన్నారని, చంద్రబాబుకు ముప్పు ఉన్న నేపథ్యంలోనే ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించారని లూథ్రా కోర్టుకు తెలిపారు.

కేంద్రం కల్పించిన సెక్యూరిటీకి సంబంధించిన అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని కోర్టుకు విన్నవించారు. హౌస్‌ రిమాండ్‌కి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లూథ్రా వివరించారు. ఇందుకు గౌతం నవలాఖ కేసును ఉదహరించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించారు.

ఉన్నతాధికారులతో సీఎం జగన్ కీలక సమావేశం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష

టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలపై దృష్టి సారించిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అక్రమాల కేసులో మాజీ సీఎం చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్‌ కోరుతూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇప్పటి వరకు కౌంటర్ పిటీషన్ ఎందుకు వేయలేదని ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడు తరపు లాయర్లను ప్రశ్నించింది. దీంతో.. రేపు వేస్తామని కోర్టుకు తెలిపారు వాళ్లు. రేపు.. కౌంటర్ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.చంద్రబాబును ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

రాజమండ్రి జైలులో చంద్రబాబుకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్టు జైళ్ల శాఖ పేర్కొంది. చంద్రబాబు కోసం ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. చంద్రబాబు కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లను కోర్టుకు జైళ్ల శాఖ తెలిపింది. చంద్రబాబు కోసం ఓ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. జైలు ప్రధాన బ్లాక్‌తో సంబంధం లేకుండా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని తెలిపింది

భద్రత దృష్ట్యా బ్లాక్‌ అన్ని వైపులా బలగాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ వార్డుల్లోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరూ ప్రవేశించాలన్నా.. ప్రత్యేక అనుమతులు అవసరం. చంద్రబాబు అనుమతితోనే ములాఖత్‌కు అనుమతిస్తాం. రాజమండ్రి సూపరింటెండెంట్‌ సహా అధికారులు అందుబాటులో ఉంటారు. 24 గంటలపాటు ఈ వార్డు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని తెలిపింది.