Nellore, Dec 29:నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు రోడ్ షో ప్రమాద ఘటనలో (Stampede at TDP Road Show) మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం చేయాలని టీడీపీ నిర్ణయించింది. మృతి చెందిన ఎనిమిది మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు పార్టీ తరఫున అందించాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) సీనియర్ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో నిర్ణయం తీసుకున్నారు.
మొదట పార్టీ తరఫున రూ. 10 లక్షలు ఇవ్వాలని భావించినా తర్వాత రూ. 15 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. వీటితో పాటు పలువురు టీడీపీ నాయకులు వ్యక్తిగతంగా కూడా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల వరకు సాయం చేయాలని నిర్ణయించారు.దీంతో మృతి చెందిన ప్రతి కార్యకర్త కుటుంబానికి టీడీపీ తరఫున రూ. 25 లక్షల సాయం అందనుంది.
మరోవైపు ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం తరఫున మోదీ రూ. 2 లక్షల సాయం ప్రకటించగా.. రాష్ట్రం తరఫున రూ. 2 లక్షల చొప్పున అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కందుకూరు ప్రమాదంలో బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శిస్తున్నారు. మృతి చెందిన గడ్డం మధుబాబు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆర్థిక సాయం అందించిన వారి వివరాలు..
* తెదేపా ఆర్థిక సాయం - రూ.15,00,000/-
* ఇంటూరి నాగేశ్వర్ రావు - రూ. 1 లక్ష
* ఇంటూరి రాజేష్ - రూ.1 లక్ష
* కోమటి జయరాం - రూ.లక్ష
* శిష్ట్లా లోహిత్ - రూ. 1 లక్ష
* బేబీ నాయన - రూ.50,000
* కేశినేని శివనాథ్ (చిన్ని) - రూ.50,000
* కంచర్ల సుధాకర్ - రూ.2 లక్షలు.
* కంచర్ల శ్రీకాంత్ - రూ. 1 లక్ష
* అబ్దుల్ అజీజ్ - రూ.50,000
* పోతుల రామారావు - రూ.50,000
* పొడపాటి సుధాకర్ - రూ.50,000
* వెనిగండ్ల రాము - రూ. 50,000