Kakinada, Oct 25: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ (Kakinada Municipal Corporation) మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికపై ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. ఎస్‌ఈసీ అధికారులు ఎన్నికలను ఇవాళ నిర్వహించారు. నగరపాలక సంస్ధ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఎన్నిక జరిగింది. గతంలో మెజారిటీ కార్పోరేటర్లు అవిశ్వాసం మేరకు మేయర్ (Kakinada Municipal Corporation new mayor), డిప్యూటీ మేయర్ లను తొలగించారు. ఈమేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు నేడు మేయర్, డిప్యూటీ మేయర్‌ల పదవులకు ఎన్నికలు నిర్వహించారు
కాకినాడ మేయర్‌గా 40 వ వార్డు కార్పొరేటర్ సుంకర శివప్రసన్న (sunkara siva prasanna) , డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఈ మేయర్ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాలేదు. ఎన్నిక అనంతరం మేయర్ శివప్రసన్న మీడియాతో మాట్లాడుతూ, కాకినాడ నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. సహచర కార్పొరేటర్ల సహకారం ఎప్పటికప్పుడు తీసుకుంటానన్నారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ఇప్పటి వరకూ మేయర్‌గా ఉన్న సుంకర పావనిపై మెజార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో.. ఆమెను తొలగిస్తూ ప్రభుత్వం ఈ నెల 12న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
2017లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకుగాను 48 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 32 టీడీపీ, 10 వైసీపీ, 03 బీజేపీ, 03 ఇండిపెండెంట్లు గెలుపొందారు. అప్పట్లో ఇండిపెండెంట్‌లు అందరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మేయర్ వ్యవహారశైలి నచ్చక కొందరు టీడీపీ కార్పొరేటర్లు విభేదించారు. ఈ పరిణామాలు తారస్థాయికి చేరి మొత్తం టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌కు దూరమయ్యారు. కాకినాడ మేయర్‌పై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో మేయర్ సుంకర పావని, ఉప మేయర్-1 సత్తిబాబు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. దీంతో పావని పదవిని కోల్పోయారు.