
Vjy, Feb 25: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లవద్దని రమేశ్, అవినాశ్ లను ఆదేశించింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వం తరువు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. బెయిల్‌ను వ్యతిరేకించగా, ఈ కేసుపైనే (TDP Office Attack Case) ఎందుకు స్పెషల్ అటెన్షన్ అంటూ సిద్ధార్థ లూత్రాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఇది రాజకీయపరమైన కేసు అని.. పాస్ పోర్ట్‌ను ఇప్పటికే సరెండర్ చేశామన్నారు. దాడికి పాల్పడ్డ 30 మందికి ఏపీ హై కోర్టు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిన రోజు అక్కడ లేరు. వీళ్ల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవు’’ అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ హాజరయ్యారు.
వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... నిందితులు (YSRCP Leaders) మూడేళ్లుగా ముందస్తు బెయిల్ కానీ, బెయిల్ కానీ కోరలేదని... ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాతే కోర్టు మెట్లు ఎక్కారని తెలిపారు. ప్రభుత్వం మారడంతో తమ తప్పు బయట పడుతుందనే ఉద్దేశంతోనే కోర్టును ఆశ్రయించారని చెప్పారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడి చేయడమే కాక, ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అవినాశ్ ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని చెప్పారు. అవినాశ్ దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిపారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడేళ్లుగా దర్యాప్తు చేయకుండా తాత్సారం చేశారని... తద్వారా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు పిటిషన్లు దాఖలు చేశారని... అయితే, ఇందులో కల్పించుకోవడానికి తమకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని చెప్పింది. నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ... దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది.
వైఎస్సార్ సీపీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ తన కార్యకర్తలని, నాయకుల్ని కాపాడుకుంటున్నారు. టీడీపీ గెలిచిన నాటి నుంచి ఫ్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులను వెంటాడి వేటాడి హింసిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన దాడి.. ఇప్పుడు కొత్త కేసులు పెట్టి 128 మందిని ముద్దాయిలను చేసి హింసిస్తున్నారు. టిడిపి కార్యాలయం, చంద్రబాబు నివాసం పై దాడి కేసుల్లో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం, ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. దేవినేని అవినాష్, జోగి రమేష్ లతో పాటు పలువురికి ముందస్తు బెయిల్ వచ్చింది. మన కార్యకర్తలు, నాయకులు కోసం పోరాడాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారు. ఇందుకు ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకులు గర్వించాలి. ఎవరికి బెయిల్ రాకుండా, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చివరి వరకు ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణకు మా నాయకులు హాజరై సహకరిస్తారు’ అని పొన్నవోలు స్పష్టం చేశారు