Chandrababu Protest Row: చంద్రబాబు నిరసనకు అనుమతి లేదు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పర్మిషన్ ఇవ్వడం కుదరదు, నోటీసులు జారీ చేశామని తెలిపిన తిరుపతి అర్భన్‌ ఎస్పీ అప్పలనాయుడు
TDP chief Chandrababu Naidu detained at Tirupati airport (Photo-Twitter)

Amaravati, Mar 1: వైసీపీ ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ తిరుపతిలోని గాంధీ విగ్రహ కూడలిలో నిర‌స‌నకు టీడీపీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన‌డానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి (Tirupati airport) చేరుకోగా అక్క‌డ ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ ఘటనపై తిరుపతి అర్భన్‌ ఎస్పీ అప్పలనాయుడు స్పందించారు. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరుపతిలో చేపట్టబోయే నిరసన ప్రదర్శనకు (Chandrababu Protest Row) అనుమతి లేదని అన్నారు. ఇప్ప‌టికే చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశామని తెలిపారు

ఈ విషయాన్ని చంద్రబాబుకు (TDP chief Chandrababu Naidu) నిన్ననే తెలియజేశామని కానీ ఆయన వినకుండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని, అందుకే అడ్డుకున్నామని స్పష్టం చేశారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో పోలీసులు బాబును అడ్డుకున్నారు. నిరసన తెలిపేందుకు అనుమతి లేదని వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. అయినప్పటికీ వినని చంద్రబాబు.. లాంజ్‌లోని ఫ్లోర్‌పైనే బైటాయించారు.

సమావేశం నుంచి టీడీపీ నేత వర్ల రామయ్యని బయటకు పంపించిన ఎస్ఈసీ, అఖిలపక్ష నేతలతో ముగిసిన నిమ్మగడ్డ భేటీ, మునిసిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలని పిలుపు

ఈ మేరకు ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పినా తిరుపతిలో బస్టాండ్‌ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహం ఎదుట ధర్నాకు పూనుకున్నారని తెలిపారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌కు సమీపంలో గాంధీ విగ్రహం ఉందని, వారు ఎంపిక చేసుకున్న స్థలం భక్తులతో నిండి ఉంటుందన్నారు. అక్కడ ధర్నా చేస్తే తిరుమలకు వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని చెప్పి టీడీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. జన సమీకరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

Here's Telugu Desam Party Tweets

అదే విధంగా ధర్నాలు, ర్యాలీలు ఎన్నికల నియమావళికి, కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధమని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్‌ తెలిపారు. అందుకే చంద్రబాబు నాయుడి ధర్నాకు అనుమతి ఇవ్వలేదన్నారు. 5 వేల మందితో ధర్నా చేస్తున్నట్లు నిన్న రాత్రి లెటర్ ఇచ్చారని, అనుమతి ఇవ్వమని అప్పుడే చెప్పామని పేర్కొన్నారు.చిత్తూరు నడిబొడ్డులో ధర్నాకు అనుమతి కోరారని, సిటీ బయట అయితే చేసుకోవచ్చని చెప్పినట్లు తెలిపారు.

అయినా వినకుండా ఈ రోజు ఉదయం కొందరు టీడీపీ నేతలు ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారని వారందరినీ ముందస్తుగా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో టీడీపీ నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులను పోలీసులు నిర్బంధించారు.

చంద్రబాబు నిరసన కార్యక్రమానికి గత రాత్రి 11.30 గంటల సమయంలో అనుమతి నిరాకరిస్తూ చిత్తూరు పోలీసులు ఉత్తర్వులు ఇచ్చారు. కొవిడ్ నేపథ్యంలో అంతమందితో కార్యక్రమ నిర్వహణకు అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అలాగే, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉందని, కాబట్టి అనుమతి ఇచ్చేది లేదని డీఎస్పీ స్పష్టం చేశారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉల్లంఘించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, క్రికెట్‌ కిట్లను పంపిణీ చేస్తూ పట్టుబడిన వైనం

ఎన్నికల సంఘం అనుమతితో వస్తే అనుమతి ఇస్తామని, పంచాయితీ ఎన్నికల్లో అరాచకాలు జరిగాయని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. ఎస్‌ఈసీ ఆధీనంలో అధికారులు పనిచేస్తున్నారు. ఐదుగురికి మించి ప్రచారంలో పాల్గొన కూడదని నిన్ననే ఎస్‌ఈసీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాజకీయ పార్టీలకు తెలిపారు.

ఇదిలా ఉంటే తనను పోలీసుల‌ు అడ్డుకోవడంపై చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. చంద్ర‌బాబుతో పాటు పీఏ, వైద్యాధికారి ఫోన్ల‌ను పోలీసులు తీసేసుకున్నారు. తాను క‌లెక్ట‌ర్ తో పాటు, తిరుప‌తి, చిత్తూరు ఎస్పీల‌ను క‌లిసి, త‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవ‌డంపై విన‌తి ప‌త్రం ఇస్తాన‌ని పోలీసుల‌కు చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. అధికారుల‌ను క‌లిసేందుకు కూడా పోలీసులు అనుమతిని నిరాక‌రించారు. దీంతో అనుమ‌తి ఇవ్వాల్సిందేన‌ని చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టుబ‌ట్టారు. అనుమ‌తి ఇచ్చేవ‌ర‌కు తాను బైఠాయించిన ప్రాంతం నుంచి క‌ద‌ల‌బోనంటూ పోలీసుల‌కు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓ ప్ర‌తిప‌క్ష నేత‌గా క‌లెక్ట‌ర్, ఎస్పీల‌ను క‌లిసే హ‌క్కు కూడా త‌న‌కు లేదా? అంటూ మండిప‌డ్డారు.

విమానాశ్రయం నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ట్రూజెట్, ఇండిగో, స్పైస్ జెట్ విమానాల్లో చంద్రబాబుకు టికెట్లు బుక్ చేశారు. అయితే స్పైస్ జెట్ విమానం వెళ్లిపోగా.. రన్ వేపై ఇండిగో విమానం సిద్ధంగా ఉంది. అయితే చంద్రబాబు మాత్రం తన నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు.

ఇక చిత్తూరు జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బోణీ కాదని, ఆయన విజయవాడ పరిసర ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం పుంగనూరు మండలం కురప్పల్లెలో జరిగిన మసెమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడతో కలసి విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు కరోనాకు భయపడి ఎక్కడా పర్యటించకుండా ఇంటికే పరిమితమయ్యారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారని గుర్తు చేశారు. పర్యటనలో ఆయన మాట్లాడిన పదజాలం వింటే హాస్యాస్పదంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు మనుగడ లేదని చెప్పారు. ఆయన కుప్పంలో కాదుకదా జిల్లాలో ఎక్కడా గెలవలేడని జోస్యం చెప్పారు.

అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలను బెదిరించాల్సిన అవసరం తమకు లేదని, చంద్రబాబు తన పార్టీ పరిస్థితిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఎస్‌ఈసీ అనుమతి లేకుండా తిరుపతికి వచ్చి బాబు నానాయాగీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే చంద్రబాబు మాత్రం దౌర్జన్యాలు జరిగాయంటున్నారని మండిపడ్డారు.గతంలో అధికారంలో ఉన్నప్పుడు హామీలను ఎందుకు నెరవేర్చలేదో.. ప్రజలంతా కలిసి చంద్రబాబును నిలదీయాలన్నారు.