
Amaravati, April 25: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో పలు అక్రమాలు, అవినీతికి పాల్పడారనే ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను (TDP Leader, Ponnur Former MLA Dhulipalla Narendra) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసిన సంగతి విదితమే. ఏసీబీ కోర్టు (ACB Court) ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు (Central Prison in Rajahmundry) తరలించారు.
ధూళిపాళ్లతో పాటు డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణ, రిటైర్డ్ జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎం.గురునాథంలకు విజయవాడలో శుక్రవారం రాత్రి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలు రావాల్సి ఉండటంతో కృష్ణా జిల్లా కోవిడ్ జైలుగా కేటాయించిన మచిలీపట్నం జైలులో వారిని ఉంచారు. ముగ్గురికి కోవిడ్ నెగెటివ్ అని శనివారం ఫలితం రావడంతో వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రస్తుతం సంగం డెయిరీ (sangam dairy) ఛైర్మన్‌గా ఉన్నారు. సంగం డైయిరీలో అక్రమాలు జరిగాయని ఆయనపై ఏసీబీ కేసుపెట్టింది. సెక్షన్ 408, 409, 418, 420, 45, 471, 120బీ కింద కేసులు నమోదు చేశారు. నాన్ బెయిల్ కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ధూళిపాళ్ల సతీమణి సీఆర్‌పీసీ సెక్షన్ 50 (2) కింద నోటీసులు జారీచేశారు.
ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి 1994 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతల కిలారి వెంకట రోశయ్య చేతిలో ఆయన ఓడిపోయారు. 1112 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అంతేకాదు 2010 నుంచి ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీకి ఛైర్మన్‌గా ఉన్నారు.
సంగం డెయిరీ ఆధ్వర్యంలో అనేక ఆర్థిక పాలనా పరమైన అవకతవకలు జరిగాయని ఏసీబీ పేర్కొంది. ఇతరుల సహకారంతో చైర్మన్ నరేంద్ర అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ తెలిపింది. తీవ్రమైన నేరం కావడం వల్ల ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లభించాయని ఏసీబీ వెల్లడించింది. సంగం డైరీ చైర్మన్‌గా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారని ఏసీబీ స్పష్టం చేసింది. డైరీని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని పేర్కొంది. ఈ కేసులో డెయిరీ చైర్మన్ నరేంద్రకుమార్ ఏ1, ఏ2 డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, ఏ3గా ఎం. గురునాథం ఉన్నారని ఏసీబీ వెల్లడించింది.