Chandrababu Vision 2047 (Photo-Twitter/TDP)

Chandrababu Naidu Unveils 'Vision 2047': విశాఖ వేదికగా చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరించారు. ఇందులో అయిదు కీలక అంశాలను ఆయన ప్రజెంట్ చేశారు. భారతదేశం 2047 నాటికి ప్రపంచ నెంబర్ వన్‌ ఆర్థిక శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రాఫ్ట్ విజన్ ను ప్రజల ముందుకు తెస్తున్నాననీ దీనిపై మేథావులు, నిపుణులు స్పందించి సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు.

బీచ్ రోడ్ లో రెండున్నర కిలోమీటర్ల జాతీయ సమైక్యతా పాదయాత్ర చేసిన తర్వాత.. ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి విజన్ ఉండాల్సిన అవసరం ఉందనీ, దీనిలో భాగంగానే ఇండియా, ఇండియన్స్, తెలుగూస్ అని విజన్ ను రూపొందించానన్నారు.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త, జీతాలను 37 శాతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

తన దూరదృష్టి వల్లే నేడు హైదరాబాద్‌లో ఎక్కువ తలసరి ఆదాయం ఉందని చంద్రబాబు అన్నారు. ఇండియా, ఇండియన్స్‌, తెలుగూస్‌ పేరుతో విజన్‌ డాక్యుమెంట్​ను చంద్రబాబు విడుదల చేశారు. జీఎఫ్‌ఎస్‌టీ ఛైర్మన్ హోదాలో డాక్యుమెంట్ తయారీకీ చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారు. మన ఆర్థిక విధానాల వల్ల 1991 వరకు దేశాభివృద్ధి పెద్దగా లేదన్న చంద్రబాబు.. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల శక్తిమంతంగా మారామని తెలిపారు.

90ల్లో వచ్చిన ఇంటర్‌నెట్‌ రివల్యూషన్‌ వల్ల ప్రపంచంలో పెను మార్పులు వచ్చాయన్నారు. విభజన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌ 2029కు పిలుపు ఇచ్చామని తెలియజేశారు. వందేళ్ల పంద్రాగస్టు వేడుక నాటికి భారత్‌ సూపర్ పవర్‌ అవుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు.

కాలుష్యం లేని విద్యుత్‌ ఉత్పత్తి పెంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. సెల్‌ఫోన్‌ తిండి పెడుతుందా అని ఆనాడు ఎగతాళి చేశారన్న చంద్రబాబు.. ఇప్పుడు సెల్‌ఫోన్‌తో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. పెరుగుతున్న యువత దేశాభివృద్ధికి చాలా కీలకంగా మారతారని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం తేవాలని ఆకాంక్షించారు.

చైనా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారాలని.. 21వ శతకం మనదే అవుతుందని, అందులో అనుమానమే లేదని చంద్రబాబు చెప్పారు. 2047లోగా సంక్షేమం, అభివృద్ధి, సాధికారత రావాలని ఆకాంక్షించారు. పేదరికం లేని సమాజం కోసమే పీ-4 మోడల్ ప్రకటించానని చంద్రబాబు అన్నారు.

యువత కోసం ఎంప్లాయిమెంట్ ట్రాకింగ్ సిస్టమ్ రూపొందించాలని.. హైబ్రిడ్ వర్కింగ్‌ సద్వినియోగానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. 2047 నాటికి 10 కోట్లమంది ఎన్‌ఆర్‌ఐలు ఉండేలా చూడాలన్నారు. నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతులు త్వరగా పెంచాలని తెలిపారు.

Here's Vision 2047 Explain Videos

2030 నాటికి కర్బన ఉద్గారాలను 40 శాతం తగ్గించాలని చంద్రబాబు కోరారు. స్థానికంగా ఇంధనోత్పత్తి, వినియోగం, గ్రిడ్ల ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. సీఎన్‌జీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, సరఫరాపై దృష్టి సారించాలని.. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి నీటినిల్వ సామర్థ్యం భారీగా పెంచాలని తెలిపారు. దేశంలోని 37 ప్రధాన నదులను త్వరగా అనుసంధానం చేయాలని చెప్పారు.

ఈ విజన్ డాక్యుమెంట్‌ డ్రాఫ్ట్ మాత్రమే అని పేర్కొన్న చంద్రబాబు.. దీనిపై మేధావులు చర్చించాలని కోరారు. దేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి బాగా పెంచాలని తెలిపారు. సౌర విద్యుత్‌ యూనిట్‌ ధరను బాగా తగ్గించగలిగామని.. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచాలని అన్నారు.

విజన్ 2047 డాక్యుమెంట్‌లో ఐదు స్ట్రాటజీలు పేర్కొన్న చంద్రబాబు.. డాక్యుమెంట్‌లో ఇండియన్ ఎకానమీ యేజ్‌ గ్లోబల్ ఎకానమీ గురించి ప్రస్తావించారు. డాక్యుమెంట్‌లో డెమొగ్రఫిక్‌ మేనేజ్‌మెంట్‌, పీ-4 మోడల్‌ ఆఫ్ వెల్ఫేర్‌ గురించి ప్రస్తావించారు. విజన్‌ డాక్యుమెంట్‌లో రీసెర్చ్ ఇన్నొవేషన్‌, టెక్నాలజీ గురించి.. పునరుత్పాదక ఇంధన వనరుల ఆవశ్యకత గురించి, వాటర్‌ సెక్యూర్‌ ఇండియా గురించి చంద్రబాబు వివరించారు.

ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారన్న చంద్రబాబు.. మనదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని కోరుకోవాలని అన్నారు. దేశాభివృద్ధిలో తెలుగుజాతి ప్రముఖ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. విజయవాడ, గుంటూరు మధ్య అమరావతి నగరం తలపెట్టామన్న చంద్రబాబు.. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా మార్చాలని అనుకున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో 10 ప్లస్ గ్రోత్ రేట్ సాధించామని అన్నారు. విశాఖ ప్రజలు కూడా అమరావతి కావాలని కోరుకుంటున్నారని.. వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే శక్తి భారత్​కు ఉందని అన్నారు.

విజన్‌ ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఉన్నత స్థానాలకు వెళ్తారని చంద్రబాబు అన్నారు. 2047లో వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటామని.. అప్పటికి ఏ విధంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఆలోచించాలని సూచించారు.

చంద్రబాబు ప్రెజెంట్ చేసిన ఐదు కీలక అంశాలు

1. గ్లోబల్ ఎకానమిగా భారత ఆర్థిక వ్యవస్థ-ప్రపంచ పౌరులుగా భారతీయులు – బహుళ జాతీయ కంపెనీలుగా భారత కార్పొరేట్లు

2. డెమోగ్రాఫిక్ మేనేజ్ మెంట్ – పి 4 మోడల్ సంక్షేమం

3. సాంకేతికత, పరిశోధన, సృజనాత్మకత – భావి నాయకత్వం

4. ఎనర్జీ సెక్యూర్ ఇండియా – డెమోక్రైటేషన్, డీకార్బనైజేషన్, డిజిటలైజేషన్

5. వాటర్ సెక్యూర్ ఇండియా..సోలార్, విండ్ సౌకర్యాలు

ఈ ఐదు అంశాల ద్వారా ప్రజలు స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. దీన్ని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా విద్యుత్ చార్జీలు పెంచే అవసరం ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది దేశంలో గేమ్ చేంజర్ అవుతుందన్న టీడీపీ అధినేత.. నీరు అత్యంత విలువైనదనీ, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు.

విజన్ డాక్యుమెంట్ లోని 5 వ్యూహాలపై చంద్రబాబు వివరణ...

1. సోలార్ ఎనర్జీ, విండ్, పంప్డ్ ఎనర్జీ, హైబ్రిడ్ మోడల్ డెమోక్రటైజేషన్, డీకార్బనైజేషన్ అండ్ డిజిటలైజేషన్

భగవంతుడు భారతదేశానికి మంచి ఎండను ఇచ్చాడు. ఆ ఎండ సాయంతో కరెంటు తయారుచేసుకోవచ్చు. ఒకప్పుడు సోలార్ విద్యుత్ ఒక యూనిట్ రూ.14 ఉంటే, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోలార్ విద్యుత్ ఒక యూనిట్ రూ.1.50 నుంచి రూ.2.00కి వస్తుందంటే అందరూ ఎగతాళి చేశారు. ప్రస్తుతం రూ.1.99కి వచ్చింది. విస్తృత స్థాయిలో ఉత్పాదన చేసినప్పుడు ఆటోమేటిగ్గా రేట్లు తగ్గుతాయి. ఆ మేరకు టీడీపీ ప్రభుత్వం చొరవ చూపింది.

సోలార్ విద్యుత్ ఎండ ఉంటేనే వస్తుంది. ఎండ లేని సాయంత్రం వేళల్లో పవన్ శక్తి (విండ్ ఎనర్జీ) ద్వారా విద్యుత్ తయారు చేసుకోవాలి. ఇవేవీ లేనప్పుడు పంప్డ్ ఎనర్జీ (హైడల్) తీసుకోవాలి. ఈ మూడింటిని కలిపినదే హైబ్రిడ్ మోడల్. దీని ద్వారా అన్ని రంగాలకు విద్యుత్ అందించవచ్చు. వీటివల్ల కాలుష్యం కూడా ఉండదు. డిజిటలైజేషన్ వల్ల విద్యుత్ గ్రిడ్ మేనేజ్ చేసుకోవచ్చు. ఎనర్జీ అనేది గేమ్ చేంజర్.

2. వాటర్ సెక్యూర్ ఇండియా

నీటి ప్రాధాన్యత చాలా ఉంది. హైడల్ ఎనర్జీలో నీళ్లే కీలకం. వ్యవసాయానికి కూడా నీళ్లు కావాలి. అందుకే భారత్ నీటి పరంగా పూర్తి భరోసాతో ఉండాలనే వాటర్ సెక్యూర్ ఇండియా సిద్ధాంతం తీసుకువచ్చాం.

3. డీప్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ లీడర్స్ ఆఫ్ ఫ్యూచర్

ఇప్పుడు టెక్నాలజీ ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలుసు. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నవ్వారు. సెల్ ఫోన్ ఏమైనా తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు. కానీ ఆ రోజు ఒకటే చెప్పాను... సెల్ ఫోన్ ను అందరూ గుర్తించే రోజు వస్తుంది అని స్పష్టం చేశాను. ఇవాళ సెల్ ఫోన్ తిండిపెట్టడమే కాదు, లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తోంది. అదీ... టెక్నాలజీకి ఉండే శక్తి. టెక్నాలజీతో భవిష్యత్తులో చాలా మార్పులు రాబోతున్నాయి.

4. డెమొగ్రాఫిక్ మేనేజ్ మెంట్ అండ్ పీ4 మోడల్ ఆఫ్ వెల్ఫేర్

ఇప్పటివరకు దేశంలో జనాభా తగ్గించే ఉద్దేశంతో నియంత్రణకు వెళ్లాం. జనాభా పెరుగుదలను కట్టడి చేశాం. ఇప్పుడు నేను ఏమంటానంటే... అధిక జనాభానే మన అనుకూలత అంటాను. ఈ అనుకూలత 2047 వరకు ఉంటుంది. ఆ తర్వాత దేశంలో ముసలివాళ్ల సంఖ్య పెరిగి, యువత సంఖ్య తగ్గిపోతుంది, పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. దాని వల్ల ఇబ్బందులు వస్తాయి. మేం రూపొందించిన జనాభా నిర్వహణ సిద్ధాంతం ఆ సమస్యకు పరిష్కారం చూపుతుంది.

ఇందులోనే పీ4 మోడల్ కూడా పొందుపరిచాం. ప్రతి ఒక్కరూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోవడం కాదు... ఈ స్వతంత్ర భారతదేశంలో పేదరికం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది.

5. ఇండియన్ సిటిజెన్ టు సర్వ్ గ్లోబల్ ఎకానమీ

భారతదేశంలోని ప్రతి వ్యక్తి తన సేవలను, తన ఉత్పాదనలను ప్రపంచానికి అందించే దిశగా ఆలోచిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి.