Fire breaks out at COVID care centre in Vijayawada | Photo Twitter

Vijayawada, August 10: విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనలో (Vijayawada Fire Accident) పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. రమేష్‌ ఆస్పత్రి జీఎం సుదర్శన్‌, చీఫ్‌ ఆపరేటర్‌ రాజా గోపాల్‌రావుతో పాటు నైట్‌ షిఫ్ట్‌ మేనేజర్‌ వెంకటేష్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాదంపై విజయవాడ సెంట్రల్‌ తహసీల్దార్‌ జయశ్రీ ఫిర్యాదు మేరకు వీరిని అరెస్టు చేసినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్‌ పేట పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.

స్వర్ణ ప్యాలెస్‌తో రమేష్‌ ఆస్పత్రి ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వర్ణ ప్యాలెస్‌ను (Swarna Palace) జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ కమిటీ సభ్యులు పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి కారణాలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చామని.. రెండు రోజుల్లో నివేదికను కలెక్టర్‌కు అందచేస్తామని శివశంకర్‌ మీడియాకు వెల్లడించారు. అగ్నిప్రమాదంపై రాష్ట్ర స్థాయిలో మరో రెండు కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ప్రమాదం ఎలా జరిగింది? విచారణకు రెండు కమిటీలు ఏర్పాటు, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు, మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూ. 2 లక్షలు, రాష్ట్రం నుంచి రూ. 50 లక్షలు

రమేష్ ఆస్పత్రికి (Ramesh Hospitals) అనుబంధంగా తీసుకున్న హోటల్ స్వర్ణ హైట్స్, స్వర్ణా ప్యాలెస్‌లో ఒక కమిటీ తనిఖీలు చేస్తోంది. ఆస్పత్రిలో కోవిడ్ పేషెంట్లకు తీసుకుంటున్న ప్రమాణాలపై కూడా దర్యాప్తు చేస్తోంది. మరో కమిటీ షార్ట్ సర్క్యూట్‌కు గల కారణాలపై తనిఖీలు చేస్తోంది. ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏ విధంగా ఉన్నాయన్నదానిపై పరిశీలిస్తోంది. సోమవారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో వివిధ విభాగాల అధికారులు తనిఖీలు చేస్తున్నారు.