Tirumala, April 3: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయంలో పదవీ విరమణ చేసిన అర్చకులు (retired priests) తిరిగి విధుల్లో చేరేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు తిరుమల దేవస్థాన కమిటి (Tirumala Tirupati Devasthanam) ఉత్తర్వులు జారీ చేసింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ ఆదేశాలతో తిరిగి ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు ఆలయ ప్రవేశం చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది.
కాగా అర్చకుల పదవీవిరమణపై మే 16, 2018లో టీటీడీ పాలకమండలి ఓ నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయస్సును నిర్ధారించి, అది దాటిన వారంతా పదవీ విరమణ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నలుగురు ప్రధాన అర్చకులతో పాటు మరికొంత మంది అర్చకులు పదవీ విరమణ చేశారు. తర్వాతి కాలంలోనూ అదే కొనసాగింది. అయితే, పాలక మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2018లోనే అర్చకులు కోర్టును ఆశ్రయించారు.
శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అర్చకులకు వయస్సు మళ్లినప్పటికీ విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు వెలువరించింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. అయితే వయోభారం కారణంగా స్వామివారి కైంకర్యాలు చేయలేరనే ఉద్దేశంతో పాలక మండలి కోర్టు తీర్పును అమలు చేయలేదు. తాజాగా దీనిని అమల్లోకి తెచ్చినట్లు సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయంతో ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు విధుల్లో చేరనున్నారు. ఆయనతో పాటు పలువురు అర్చకులకు కూడా అవకాశం కలగనుంది.
ఇక శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వాయిదా వేసింది. 14 నుంచి భక్తులను ఆర్జిత సేవలకు అనుమతించాలని ముందుగా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. కానీ దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా నిర్ణయాన్ని టీటీడీ వాయిదా వేసింది. భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునట్లు టీటీడీ ప్రకటించింది.