Amaravati, May 2: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ (Tirupati By Poll Result 2021) ప్రారంభమైంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు (Nellore) జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజ కవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్న మెంట్ మహిళా కళాశాలలో జరుగుతోంది.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ( tirupati lok sabha Bypoll) కౌంటింగ్‌లో వైసీపీ దూసుకెళ్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. ఇందులో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఆధిక్యంలో ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
తిరుపతిలోనూ వైసీపీ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది. తిరుమలలో వైసీపీ (YSRCP) భారీ ఆధిక్యతలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా తెలిపారు. సుమారు రెండు వేల పైచిలుకు వైసీపీ మెజారిటీలో ఉంది. దీంతో కౌంటింగ్ కేంద్రం బయట ఉన్న వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అనుచరులు, నేతలు, వైసీపీ కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ ఆధిక్యతపై తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఏజెంట్లు లేకుండా వన్‌సైడ్‌గా పోలింగ్ జరిగిందని విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ఎన్నికల రోజు ఎన్నికల ఏజెంట్ తనను కూడా స్వయంగా తిరుమలకు పంపలేదని ఆమె చెప్పుకొచ్చారు.
చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తారు.
అత్యల్పంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గ కౌంటింగ్ 14 రౌండ్లు, సుళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా లేదా ఓట ర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.