Govindarajaswamy's chariot (Photo-TTD)

Tirumala, June 16: తిరుపతిలో లావణ్య ఫోటో ప్రేమ్స్‌ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గోవిందరాజుస్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయినట్లు వస్తున్న వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేసింది.

అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతం టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. గోవింద రాజస్వామి రథానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. రథాన్ని వెనకకు జరిపి పెట్టామని, మంటలకు దగ్ధమైన షాపుకు రథానికి చాలా దూరం ఉందని తెలిపారు. పది ఫైర్ ఇంజన్‌లు మంటలను దాదాపు అదుపులోకి తీసుకొచ్చాయని, పది ద్విచక్ర వాహనాలు , ఆరు దుకాణాలు దగ్దమయ్యాయని తెలిపారు.

వీడియో ఇదిగో, తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం, గోవింద రాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు

తిరుపతిలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. గోవింద రాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో లావణ్య ఫోటో ప్రేమ్స్‌ దుకాణం అగ్నికి ఆహుతైంది.సంఘటన ప్రాంతంలో సహాయక చర్యల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫైర్ ఇంజన్ అధికారులు సకాలంలో చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారని తెలిపారు.

టీడీపీ నేతలు ఈ మంటల్లో చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గోవింద రాజస్వామి ఆలయం రథం కాలిపోయిందంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రథానికి, లావణ్య ఫ్రేమ్స్‌ దుకాణానికి చాలా దూరం ఉందని, మంటలు చూసి చలి కాసుకునే విష సంస్కృతి టీడీపీ నేతలదని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. మంటలు అంటుకుంది టీడీపీ సానుభూతి పరుడు దుకాణమేనని కానీ దాన్ని తాము రాజకీయం చేయడం లేదని, మంటలు ఆర్పేందుకు సహాయం చేస్తున్నామని తెలిపారు.