
Chennai, Dec 21: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి అనారోగ్యంతో మృతి (TTD EO Dharma Reddy's son dies) చెందారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు. పెండ్లి శుభలేఖలు పంచడానికి చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్లిన చంద్రమౌళి.. అక్కడ గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోవడంతో.. చంద్రమౌళి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరికి ఆయన మృతదేహాన్ని తరలించనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో చంద్రమౌళి వివాహం నిశ్చయమైంది. కొన్నిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వారి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలవారు శుభలేఖలు పంచుతున్నారు. చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు.
కాసేపటికే గుండెనొప్పిగా ఉన్నట్లు పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరి హాస్పిటల్‌లో ( Chennai private corporate hospital ) చేర్పించారు. అయితే మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన మరణించారు. కొన్ని రోజుల్లోనే వివాహం జరగాల్సి ఉండగా చంద్రమౌళి మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.