
Amaravati, Sep 20: గుజరాత్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ పట్టుబడింది. నిఘావర్గాల నుంచి సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు (Directorate of Revenue Intelligence (DRI) గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న రెండు కంటెయినర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తనిఖీ చేయగా దాదాపు 9 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ (Rs 9,000 crore Heroin seized from Mundra Port) పట్టుబడింది.
ఈ నెల 15న కంటెయినర్లను స్వాధీనం చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాకు ఏపీలోని విజయవాడతో సంబంధం ఉన్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గుర్తించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై విజయవాడ సీపీ స్పందించారు. గుజరాత్ నుంచి విజయవాడకు హెరాయిన్ సరఫరా చేస్తున్నారనే వార్తలు అవాస్తవమని విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు (vijayawada CP srinivasulu ) తెలిపారు. గుజరాత్ ముంద్రా పోర్టు నుంచి ఢిల్లీకి హెరాయిన్ తరలిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు సీపీ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆషీ కంపెనీ లైసెన్స్‌లో విజయవాడ చిరునామా ఉందన్న మాట వాస్తవమే అయినా విజయవాడ కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు జరగట్లేదన్నారు. చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీలో దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేశాయని చెప్పారు. విజయవాడ చిరునామాతో ఉన్న కంపెనీ యజమాని చెన్నైలో ఉంటారని.. చాలా ఏళ్ల క్రితమే చెన్నైలో స్థిరపడ్డారని సీపీ ప్రకటనలో వెల్లడించారు. చెన్నై నివాసముంటున్న దుర్గాపూర్ణ వైశాలి పేరుతో విజయవాడ అడ్రస్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారన్నారు. కొన్నేళ్లుగా వైశాలి, ఆమె భర్త, సుధాకర్ చెన్నైలో ఉంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ డీఆర్‌ఐ విచారణ జరుపుతోందని సీపీ వివరించారు. ఈ కేసుపై అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నైలలో కూడా సోదాలు నిర్వహించాయన్నారు. విజయవాడలో ఇంటి అడ్రస్‌తో లైసెన్స్ తీసుకోవడం తప్పితే డ్రగ్స్ ఆనవాళ్లు లేవని సీపీ తెలిపారు.

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ కేంద్రంగా పనిచేస్తున్న హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి టాల్కమ్ పౌడర్ మాటున వచ్చిన ఈ డ్రగ్స్ కంటైనర్లు విజయవాడ కేంద్రంగా పనిచేసే ఆషీ ట్రేడింగ్ సంస్థకు వెళ్తున్నట్టు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.సంస్థ వ్యాపార లావాదేవీలు, ఇప్పటి వరకు ఎన్ని కన్‌సైన్‌మెంట్లు ఏయే దేశాల నుంచి వచ్చాయి అన్న వివరాలను సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.