mvv-satyanarayana (Photo-Video Grab)

Visakha, June 21: తన భార్య, కొడుకు కిడ్నాప్‌ను రాజకీయం చేయడం బాధాకరమని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రౌడీషీటర్లు హేమంత్‌, రాజేష్‌లు పథకం ప్రకారం కిడ్నాప్‌ చేశారని, హేమంత్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నా ఐదేళ్ల కాల్‌డేటా తీసుకుని, ఎప్పుడైనా ఫోన్‌ చేసినా, నాకు అతని నుంచి ఫోన్‌ వచ్చినా చెప్పండి. నాకు అతని నుంచి ఫోన్‌ వచ్చినా విచారించండి.

ఈ నెల 12న తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. కిడ్నాపర్లు మా కుటుంబ సభ్యులను క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశారు. మూడు రోజులు రెక్కీ నిర్వహించి కిడ్నాప్‌ చేశారు. హేమంత్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతడిపై 13 కేసులు ఉన్నాయి. ఏ2 రాజేశ్‌పై 40కిపైగా కేసులు ఉన్నాయి. హేమంత్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. విశాఖలో రక్షణ లేదని కొందరు అనటం సరికాదు. కిడ్నాప్‌ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కేసును పోలీసులు ఛేదించారు.

డబ్బు కోసమే విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్, ఏడుమందిలో ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు, కేసు వివరాలను వెల్లడించిన డీజీపీ

నా కొడుకును హింసించి డబ్బు, ఆభరణాలు తీసుకున్నారు. మా అబ్బాయి శరత్‌తో నా భార్యను అదేరోజు పిలిపించారు..కానీ మరుసటిరోజు వెళ్లారు. శరత్‌తో ఫోన్‌ చేయించిన డ్రైవర్‌ను వెళ్లిపొమ్మన్నారు. నా కుమారుడు శరత్‌తో హేమంత్‌ భీమిలి సీఐకి ఫోన్‌ చేయించి.. రెండురోజులు పాటు హేమంత్‌ మా ఇంటి పనిలో ఉంటారని చెప్పించారు’’ అని ఎంపీ ఎంవీవీ అన్నారు.

‘‘వ్యాపారం విషయంలో ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రశాంతంగా వుండే విశాఖలో ఇలాంటివి జరగడం బాధాకరం. రఘు రామకృష్ణం రాజు అనే వ్యక్తి కుక్క తో సమానం.. ఏమి మాట్లాడుతున్నాడో తెలియదు. ఒక ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అయి ఇబ్బందుల్లో ఉంటే ఆయన అలా మాట్లాడటం దారుణం. చంద్రబాబు వ్యాఖ్యలు కూడా హాస్యాస్పదం.. ఆయన పాలనలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.’’ అని ఎంవీవీ సత్యనారాయణ అన్నారు.

నేను రాజకీయాల్లో ఉండటం వల్ల నా వ్యాపారంలో ప్రతి దాన్నీ వక్రీకరిస్తున్నారు. అందుకే వ్యాపారం తెలంగాణలో.. సేవలు ఇక్కడ అని చెప్పా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు మద్దతు లేదని ప్రచారం చేయడం సరికాదు. అందులో వాస్తవం లేదు. నా వల్ల ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే బిజినెస్‌ తెలంగాణలో చేయాలని నిర్ణయించుకున్నాను.

విశాఖలో మేమేమైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు దోచుకున్నామా? నగరంలో నమ్మకమైన సంస్థ మాది. కుటుంబం వేరు.. రాజకీయాలు వేరు. నా కుటుంబసభ్యులు కిడ్నాప్‌కు గురై చావు వరకు వెళ్లొస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా? కిడ్నాప్‌ వెనుక కుట్ర ఉందనే ఆరోపణలు దురదృష్టకరం’’ అని ఎంవీవీ సత్యనారాయణ అన్నారు.