Hyd, July 21: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఫైనల్ చార్జీషీట్ ను కోర్టుకు సీబీఐ సమర్పించింది. సీబీఐ కోర్టుకు సమర్పించిన తుది ఛార్జీషీట్ లో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారం గూగుల్ టేక్ అవుట్ గురించి తుది చార్జ్‌షీట్‌లో ఉన్నట్లు సమాచారం. గతంలో చార్జ్‌షీట్లో పేర్కొన్న నిందితుల్లో ఏ–2 సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ వివరాలను పొందుపరిచిన సంగతి విదితమే.
సునీల్ యాదవ్ 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసంలో ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక 2.35 గంటలకు వివేకా నివాసం సమీపంలో, 2.42 గంటలకు నివాసం లోపల ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన మొబైల్ నంబర్ గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించాం’ అని సీబీఐ గత చార్జ్షీట్లో పేర్కొంది. దీనిపై తాజా ఛార్జీషీట్ లో మరిన్ని వివరాలు పొందుపరిచినట్లు సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే ఏ–6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏ–7 వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్ యాదవ్ వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసానికి 30 సార్లు వచ్చినట్టుగా సీబీఐ గత చార్జ్షీట్లో పేర్కొంది.దీనిపై కూడా ఈ చార్జ్‌షీట్‌లో స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు షర్మిల తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కడప ఎంపీ టికెట్‌ను ఆశించ లేదని సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 14న పులివెందులలో హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య జరిగింది. ఈ హత్య కేసును విచారించేందుకు చంద్రబాబు సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సర్కార్ కూడ మరో సిట్ ను ఏర్పాటు చేసింది.
ఈ హత్య కేసును సీబీఐతో విచారించాలని వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి, టీడీపీ నేత బిటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సెకండ్ సప్లిమెంటరీ చార్జీషీట్ లో ఎనిమిదో నిందితుడిగా సీబీఐ చేర్చింది.ఈ ఏడాది ఆగస్టు 14న విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 14న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సమన్లు ఇచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందారు.
అయితే ఈ ముందస్తు బెయిల్ ను వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 18న సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. సునీత నర్రెడ్డి దాఖలు చేసిన కేసులో.. సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో.. జూన్ 30న దాఖలు చేసిన ఛార్జిషీట్, కేసు డైరీని సీల్డ్ కవర్లో సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. అలాగే అవినాష్ ముందుస్తు బెయిల్ వ్యవహారంపై రెండు వారాల్లోపు రిప్లై దాఖలు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
అదే విధంగా.. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే ఉన్న ఆదేశాలు అన్ని యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కూడా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌కు జత చేసింది. రెండు పిటిషన్లు కలిపే తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తేల్చి చెప్పింది.ఈ కేసుల తదుపరి విచారణను సెప్టెంబర్ 11 నుంచి మొదలయ్యే వారానికి వాయిదా వేశారు.