Amaravati, Nov 14: కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో ( Bay of Bengal ) శ్రీలంక తీరానికి ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం ఆదివారం ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. మరోవైపు ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (Another Low-pressure) ఏర్పడనుంది. దీని ప్రభావంతో 18వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, నాలుగు రోజుల నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి.
రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం ఆదివారం నాటికి కుంభవృష్టిగా మారింది.నెల్లూరు నగరం జలమయమైంది. ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం, మాగుంట లేఅవుట్‌లోని అండర్ బ్రిడ్జిల్లోకి నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జిని బ్యారికేడ్లు పెట్టి మూసేశారు. ఉమ్మారెడ్డిగుంటలోని పలు పల్లపు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. మన్సూర్‌నగర్, మనుమసిద్ధినగర్, జనార్దన్‌రెడ్డి కాలనీ, ఆర్టీసీ కాలనీ, టీచర్స్ కాలనీ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. గాంధీబొమ్మ, రాయాజీవీధి, పొగతోట తదితర ప్రాంతాల్లో రోడ్లపై పెద్ద ఎత్తున వర్షపునీరు డ్రైయినేజీతో కలిసి ప్రవహిస్తోంది. కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిలిచిన నీరు పోయేందుకు తాత్కాలిక అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
కావలి మండలం రుద్రకోట పంచాయతీ గుమ్మడిబొందల గ్రామం వద్ద చప్టాపై నీరు పొంగి ప్రవహిస్తోంది. కావలి పట్టణం బాలకృష్ణారెడ్డినగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. బ్రాహ్మణక్రాక– కృష్ణాపాడు రోడ్డుపై వర్షపు నీరు చేరింది. కొండాపురం మార్గంలో మిడతలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుడ్లూరు–బసిరెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉప్పుటేరు బ్రిడ్జిపై 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండడంతో శనివారం రాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.
గుడ్లూరు–తెట్టు ప్రధాన రహదారిలో చెమిడిదిపాడు వద్ద ఉన్న రాళ్లవాగు కూడా ఉధృతంగా పారుతుండడంతో మధ్యాహ్నం వరకు కావలి–కందుకూరు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉలవపాడు మండలంలో బద్దిపూడి–మాచవరం మధ్య ఉన్న ఉప్పుటేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మన్నేటికోట–ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రవాగు ఉధృతంగా పారుతోంది. దీంతో చుట్టుగుంటకు రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 9492691428, 9154636795, 9494070212 కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజలు కాల్ సెంటర్ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి సహాయక చర్యలు పొందవచ్చునని డీపీఓ ఎం ధనలక్ష్మి తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ తదితరశాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టింది. ఎస్పీ సీహెచ్ విజయారావు ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని తీర ప్రాంతాల్లో ప్రచారం చేయడంతో పాటు సముద్రం వద్ద పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. వర్ష ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలతో పాటు లోతట్టు, శివారు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లపై చెట్లు కూలి రవాణాకు అడ్డంకి ఏర్పడడంతో పోలీసు సిబ్బంది హుటాహుటిన తొలగించి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు.
ఆదివారం నెల్లూరు నగరంలోని జయలలితానగర్, పొర్లుకట్ట, బోడిగాడితోట, అహ్మద్‌నగర్, మన్సూర్‌నగర్, ఖుద్దూస్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆయా ప్రాంత పోలీసు అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 9440796383కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని సూచిస్తున్నారు. బుచ్చి, కోవూరు, పొదలకూరు, కలువాయి. రాపూరు. వింజమూరు, అనంతసాగరం, గుడ్లూరు, కందుకూరు పోలీసులు వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగి రోడ్లపై ప్రవహిస్తుండటంతో అటుగా రాకపోకలను నిషేధించారు.