వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానిక7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్ వైపు పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం నివేదికలో తెలిపింది.
మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్తాన్‌లోని జైసల్మేర్ నుంచి అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రం మీదుగా పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అనేక చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఈ రోజు బెజవాడలో భారీ వర్షం (Rain in Vijayawada) పడింది. కుండపోత వాన దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి వర్షం కురిసింది. భారీ వానతో ఒక్కసారిగా బెజవాడలో వెదర్ (Bejawada Weather) మారిపోయింది. వాతావరణం చల్లబడింది. కొన్నాళ్లుగా వాతావరణం ఎండాకాలాన్ని తలపించింది. మండుటెండలతో, తీవ్రమైన ఉక్కపోతతో జనం విలవిలలాడిపోయారు. సెకండ్ సమ్మర్ లా పరిస్థితి తయారైంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. ఎండల తీవ్రతతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇవేం ఎండలు రా నాయనా అని బెంబేలెత్తిపోయారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వానతో వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లగా మారడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు.