Weather Forecast: గంటకు 18 కి.మీ. వేగంతో కదులుతోన్న వాయుగుండం, వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం, దక్షిణ కోస్తా, రాయలసీమకు పొంచివున్న భారీ వర్ష ముప్పు
Cyclone (Photo Credits: Wikimedia Commons)

Amaravati, Mar 4: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న ఉదయం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా (low pressure in Bay of Bengal) బలపడింది. నిన్న మధ్యాహ్నానికి శ్రీలంకలోని ట్రికోమలైకి 360, తమిళనాడులోని నాగపట్నానికి 700, చెన్నైకి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నేడు ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫలితంగా రానున్న రెండు రోజుల్లో ఉత్తర తమిళనాడు తీరం దిశగా ప్రయాణిస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలుల తీవ్రత పెరగి సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది.

దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి ఎల్లుండి (6వ తేదీ) వరకు జాలర్లు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖలు హెచ్చరించాయి. అలాగే, వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో (Rains expected in South Coastal Andhra and Rayalaseema ) అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాల్లో, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ, ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు..

ఇది ప్రస్తుతం గంటకు 18 కి.మీ. వేగంతో కదులుతోందని.. రాగల 48 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణిస్తూ శ్రీలంక తూర్పు తీరం వెంబడి ఉత్తర తమిళనాడు వద్ద తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్చిలో తీవ్ర వాయుగుండం, తుపాను ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గడిచిన 200 సంవత్సరాల కాలంలో కేవలం 11 సార్లు మాత్రమే ఈ తరహా వాతావరణం ఏర్పడిందని.. చివరిసారిగా 1994లో బంగాళాఖాతంలో స్వల్ప తుపాను వచ్చినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుత వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై తక్కువగా ఉంటుందన్నారు.

దీని ప్రభావంవల్ల దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు, రేపు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయనీ.. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 50–60 కి.మీ. గరిష్టంగా 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. ఈ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మత్స్యకారులెవ్వరూ 6వ తేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.