Rains

ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకుని వాయవ్య బంగళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రాగల రెండు మూడు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా తీరం వెంబడి నిదానంగా పయనించనుంది. అదే సమయంలో నైరుతి రుతుపవన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని ఐఎండీ వివరించింది.ఈ క్రమంలో, ఏపీకి భారీ వర్ష సూచన చేసింది.

రాగల 5 రోజుల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు వరద హెచ్చరిక జారీ చేసింది. అంతేకాదు అధికారులను కూడా అప్రమత్తం చేసింది.

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది (Godavari River) లో నీటిమట్లం క్రమంగా పెరుగుతోంది. వరద ఉధృతి ఎక్కువవుతున్నందున అల్లూరి సీతారామరాజు జిల్లా, జిల్లా అధికారులకు కీలక ఆదేశాలిచ్చింది. ఈ రెండు జిల్లాల పరిధిలోని గోదావరి నది పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే వరద ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించింది.

గోదావరికి భారీగా వరద, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన

ముందస్తు సహయక చర్యలకు అల్లూరికు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి. వరద ఎప్పుడు ప్రభావం చూపిన మరిన్ని సహాయక బృందాలను రంగంలోకి దించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా సిబ్బందిని సిద్ధం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో 1070, 18004250101 ఫోన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచించింది.

జిల్లాల్లో మండలస్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదాని.. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ప్రజలకు సూచించింది.

తెలంగాణకు అతి భారీ వర్షాల హెచ్చరిక, హైదరాబాద్ వాసులకు హైఅలర్ట్ జారీ, భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంఛార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది జూలై 9వ తేదీన శబరి నది ఉప్పొంగి చింతూరు ప్రాంతం అంతా జలమయమైందన్నారు. శబరి ఉప్పొంగడంతో అనేక గ్రామాలు నీట మునిగాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి అక్కడ ప్రజలకు పునరావాసం కల్పించిందని గుర్తుచేశారు. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తాను అల్లూరి జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించానని అమర్నాథ్ చెప్పారు.

అల్లూరి జిల్లాకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా రంగం సిద్ధం చేశామనిమంత్రి పేర్కొన్నారు. వరద ఉధృతి పెరిగినా, అల్లూరు జిల్లా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకుండాఅన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. వైద్య సిబ్బందిని, రెవిన్యూ సిబ్బంది అప్రమత్తం చేశామని ఆయన తెలియజేశారు. గత ఏడాది వరద ఉగ్రరూపం దాల్చినా, ఏ ఒక్కరు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, ఆ తర్వాత వరదల్లో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం కూడా అందించింది అన్న విషయాన్నిమంత్రి అమర్నాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలు అధికారులు, వాతావరణ శాఖ సూచనలు పాటిస్తే ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని సూచించారు.

గోదావరి నదికి భారీగా వరద వస్తోంది. దీంతో కోనసీమలో రాకపోలకలపై ఈ ప్రభావం కనిపిస్తోంది.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద కారణంగా పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో నదీపాయకు వేసిన తాత్కాలిక గట్టు తెగిపోయింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి గట్టు తెగిపోవడంతో గంటి పెదపూడి, బురుగులంక, అరిగెల వారిపాలెం,ఉడిముడిలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి జనం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ నాలుగు గ్రామాల ప్రజలు పడవపైనే ప్రయాణాలు చేస్తున్నారు.