Bhadrachalam, JUly 20: గోదావరికి భారీగా వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు తెలంగాణలోనూ భారీగా వానలు పడుతున్నాయి. ఫలితంగా గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి. తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం, దేవీపట్నం తదితర ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. గోదావరి లోగట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
భద్రాచలం వద్ద గోదావరి వరద మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు.అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం టౌన్‌లోకి లీకేజీ వాటర్ పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో రామయ్య ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. దీంతో సింగరేణి నుంచి తెప్పించిన హై పవర్ మోటార్ల సహాయంతో నీటిని రివర్స్‌గా మళ్లీ గోదావరిలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు.ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద తీవ్రత పెరుగుతుంది. కోటిపల్లి స్నాన ఘట్టాలను వరద తాకడంతో కోటిపల్లి-ముక్తేశ్వరం పంటి ప్రయాణాలు నిలిపివేశారు. కోటిపల్లి గోదావరి సమీప గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండి పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని వరద ప్రవాహం చుట్టుముట్టింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద భారీగా వచ్చి చేరుతోంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి నీటిమట్టం అంతకంతకూ పెరగడంతో బుధవారం ఉదయానికి గండిపోచమ్మ ఆలయంలోకి వరదనీరు చేరింది.
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.050 మీటర్లకు నీటిమట్టం పెరిగింది.వరద పోటెత్తడంతో డ్యాం 48 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. స్పిల్‌వే గేట్ల నుంచి 3 లక్షల15 వేల791 క్యూసెక్కుల వరద నీటినిదిగువకు విడుదల చేశారు.