Godavari River Representational Image | (Photo-Wikimedia commons)

Amaravati, July 14: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Rains in Andhra Pradesh) కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో (East and west Godavari) జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో అత్యధికంగా 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. చాగల్లు, రాజమహేంద్రవరం, కొవ్వూరు, జీలుగుమిల్లిపాలకోడేరు, భీమడోలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కోస్తా, రాయలసీమలో మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి (Godavari River) ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద అంతకంతకూ పెరగడంతో పోచమ్మగండి వద్ద ఉన్న గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. దీంతో దర్శనాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఆలయాన్ని ఆనుకొని ఉన్న ఇళ్లన్నీ నీట మునిగాయి. ఫలితంగా బాధిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.

దేవీపట్నం, తొయ్యేరు మధ్య ఆర్అండ్‌బీ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పూడిపల్లి, తొయ్యేరు, ఏవేరవరం, కేవేరవరం, దండంగి గ్రామాల్లో వరద నీరు చుట్టుముట్టింది. పోలవరం ఎగువ కాపర్ డ్యాం వద్ద వరద నీరు పెరగటంతో పాటు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోచమ్మ గండి నుంచి పాపికొండలు వెళ్లే విహారయాత్రను అధికారులు నిలిపివేశారు.

కేసీఆర్ సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది, జీవో నెంబర్ 34 ను రద్దు చేయండి, తెలంగాణ వైఖరిపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి

భారీ వర్షాలతో బుట్టాయగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. పోగొండ రిజర్వాయర్‌లో కూడా వరద నీరు పోటెత్తుతోంది. జల్లేరు జలాశయంలో 211.80 మీటర్లకు, పోగొండ రిజర్వాయర్‌లో 155.7 మీటర్లకు నీటిమట్టం చేరిందని అధికారులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు, పిల్ల కాలువలు పొంగుతున్నాయి.

కొండవాగుల నీరు కలవడంతో గోదావరి కొద్దిగా రంగు మారి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు దిగువన కూడా నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. నక్కలగొయ్యి కాలువ, ఇసుక కాలువ, పేడ్రాల కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టిసీమ ఔట్‌ఫాల్‌ స్లూయిజ్‌ నుంచి కొవ్వాడ కాలువ అధిక జలాలు గోదావరిలోకి చేరుతున్నాయి.

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌డ్యామ్‌ ఎగువ భాగంలో రోజురోజుకూ గోదావరి నీరు ఎగపోటు తన్నుతోంది. ముంపు గ్రామాల సమీపంలోకి నీరు చేరుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షం నీరంతా గోదావరిలో కలుస్తోంది. ప్రాజెక్టు కాఫర్‌డ్యామ్‌ వద్ద మంగళవారం 27.549 మీటర్లకు నీటిమట్టం చేరింది. స్పిల్‌వేలోని 42 గేట్ల నుంచి దిగువకు నీరు చేరుతోంది. స్పిల్‌ ఛానల్‌ మీదుగా మహానందీశ్వరస్వామి ఆల య సమీపంలో సహజ ప్రవాహంలో కలుస్తోంది.

ఏపీలో 13 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ, మంగళగిరి డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి, ఏపీ రాజధానిపై గతంలో ఇచ్చిన సమాధానంపై కేంద్ర హోంశాఖ దిద్దుబాటు

గోదావరి వరద పెరుగుతుండటంతో మండలంలోని నదీ పరీవాహక గ్రామాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే తప్ప పట్టించుకోని గిరిజనులు గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరికకు కూడా చేరకుండానే గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి బ్యాక్‌ వాటర్‌ పెరగడం, గోదావరి పోటెత్తడంతో గొమ్ముగూడెం వద్ద అడుగు మేర నీరు పెరిగిందని అంటున్నారు.

కాగా ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెలకొంది. అలాగే ఒక ఉపరితల ద్రోణి గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం నుంచి ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన మరో అల్పపీడనాన్ని తాకుతూ, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్ఘఢ్‌, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి కొనసాగుతోంది.

అలాగే తూర్పు-పశ్చిమ షీర్‌జోన్‌లో కర్ణాటక తీరం నుంచి కాకినాడ తీరం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో వాయు సమ్మేళనం కొనసాగుతోంది. వీటన్నంటి ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కోస్తా వ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా కురిసే అవకాశం ఉంది.