#HBDYSJagan: ఏపీ సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు, ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు, నేను విన్నాను..నేను ఉన్నాను అంటూ ప్రజా పాలనలో దూసుకుపోతున్న యువనేత
AP CM YS Jagan Mohan Reddy (photo-Twitter)

Amaravati, Dec 21: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Y S Jaganmohan Reddy Birthday) 48వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు (#HBDBelovedCMYSJagan). చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ (PM Modi) ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, వైఎస్సార్‌ సీపీ నేతలు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం జగన్‌ పుట్టిన రోజు (#HBDYSJagan) సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌, నితిన్‌ గడ్కరీ, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, కర్ణాటక సీఎం యడ్డ్యూరప్ప, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, పరిమళ్ నత్వాని, రమేష్ పోక్రియాల్ తో సహా పలువులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు సీఎం జగన్‌ జన్మదినం పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాల చేపట్టారు. విప్లవాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మక పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొన్న సీఎం.. ఏడాదిన్నర కాలంలోనే 90 శాతం హామీలు నెరవేర్చే దిశలో పాలన సాగించారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ జగన్ అభిమానులు ఆయన బర్త్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.

ప్రజాబలం తోడుగా, ప్రతిపక్షాల బలహీనత నీడగా.., పాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) అకాల మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ (Congress Party)నుండి బయటకు వచ్చి నాన్న ఆశయాల సాధన కోసం వైయస్సార్సీపీ పార్టీని( YSRCP)స్థాపించి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నాడు.

Here's PM other Politicians Tweets

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ మరియు దేశ ప్రజల సేవలో మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షిస్తున్నాను.@ysjagan

— Lok Sabha Speaker (@loksabhaspeaker) December 21, 2020

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత అనేక కేసులను ఎదుర్కున్నారు. ఏపీ (AP)నుంచి తెలంగాణా(Telangana) విడిపోయిన తరువాత జరిగిన ఎన్నికల్లో అయిదేళ్ల పాటు ప్రతిపక్ష పాత్రను పోషించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Andhra Pradesh Legislative Assembly election, 2019) ఏపీ చరిత్రలో ఎవరూ సాధించలేని రీతిలో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.

151 స్థానాల్లో గెలుపొందిన వైయస్సార్సీపీ ప్రభంజనమే సృష్టించింది. ఓ ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగన్.. అనితర సాధ్యమైన పట్టుదలతో ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతమనే చెప్పాలి.

తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లా నుంచే జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తొలిసారిగా 2009 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

తెలుగు నేలపై చెరగని సంతకం, పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి

తండ్రి ఆకస్మిక మరణం అనంతరం ఓదార్పు యాత్ర పేరుతో వైయస్ జగన్ రాష్ట్రమంతా పర్యటించేందుకు సిద్ధం అయ్యారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అందుకు అనుమతించలేదని కారణంతో 29 నవంబర్ 2010లో ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తన పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డిపై 5,45,043 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

2011 మార్చి 11న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పేరుతో ఒక రాజకీయ పార్టీని తీసుకొచ్చారు. వాస్తవానికి వైఎస్సార్ పేరు స్ఫురించేలా కె. శివకుమార్ అనే వ్యక్తి మొదటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. దీనికి తర్వాత జగన్‌ అధ్యక్షుడు అయ్యారు. 8 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు జగన్ వెంట ఉన్నది ఆయన తల్లి విజయమ్మ మాత్రమే. ఇద్దరితో మొదలైన వైయస్సార్సీపీ ప్రస్థానం.. నేడు 151 మంది అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలను గెలుచుకునే స్థాయికి చేరింది.

తమిళనాడులో వైయస్ జగన్ హవా, విజయ్ బర్త్‌డే సంధర్భంగా పోస్టర్లలో ఏపీ సీఎం ఫోటో, విజయే రేపటి సర్కారును నిర్ణయించే సర్కార్ అంటూ క్యాప్షన్

యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆమోదం తెలిపిన సమయంలో వైసీపీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా జగన్ ఉద్యమించారు. సమైక్యాంధ్ర కోసం అనేక రకాలుగా పోరాడారు. ఎన్నికైన పార్టీ నేతలతో రాజీనామాలు చేయించారు. ఆమరణ నిరహార దీక్ష చేశారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ సారథ్యంలోని వైయస్సార్సీపీ విజయభేరి మోగించింది. 19 శాసన సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 17 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే రెండింటిలోనూ గెలిచారు.

2014 ఎన్నికల్లో ఓటమి

విడిపోయిన రాష్టంలో తొలిసారిగా 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వైసీపీ పార్టీ పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ కూటమి 175 స్థానాలకుగాను 106 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఒంటరిగా బరిలోకి దిగిన వైసీపీ 67 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక తెలంగాణలో ఆ పార్టీ 3 శాసన సభ, ఒక పార్లమెంట్ స్థానంలో గెలిచింది. అయితే తర్వాత కాలంలో వారందరూ టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

తండ్రి మరణాంతరం ఓదార్పు యాత్ర

తండ్రి మరణాంతరం ఓదార్పు యాత్రతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పర్యటించిన వైయస్ జగన్ ఆ తర్వాత ప్రజలతో మమేకం అయ్యేందుకు అనేక యాత్రలను నిర్వహించారు. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా జన దీక్ష, కృష్ణా నది జలాల వినియోగంపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీకి న్యాయం చేయాలని ఢిల్లీలో జల దీక్ష, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేనేత దీక్ష, రైతు సమస్యలపై రైతు దీక్ష చేశారు.

ప్రత్యేక హోదా కోసం పోరాటం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని జగన్ సారథ్యంలోని వైసీపీ పోరాడింది. ఎన్డీయే ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో వైసీపీ ఎంపీలు రాజీనామా కూడా చేశారు.

అధికారాన్ని అందించిన ప్రజా సంకల్పయాత్ర

చివరిగా 2019 ఎన్నికలకు ఏడాదికి ముందు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో 14 నెలల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. 2017 నవంబర్ 6న ప్రారంభమైన ఈ యాత్ర 2019 జనవరి 9న ముగిసింది. తన యాత్రలో భాగంగా దాదాపు 3000 కిలోమీటర్లు జగన్ పర్యటించారు. రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ యువత నినాదాలు చేస్తుంటే.. అలసట లేకుండా జగన్ పాదయాత్ర చేపట్టారు. దేశంలోని పెద్దగా ఎవరికీ తెలియని స్థాయి నుంచి అమెరికన్లు సైతం ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే మాటలకు స్పందించే స్థాయికి ఆయన ఎదిగారు.

తండ్రి పథకాలే శ్రీరామ రక్షగా..

తండ్రి వైయస్సార్ పేరు ప్రజల్లో గుండెల్లో ఇంకా సజీవంగా ఉండటం వైయస్ జగన్ కు బాగా కలిసివచ్చింది. తండ్రి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తదితర పథకాలు వైఎస్‌కు ప్రజల్లో మంచి ఆదరణ తీసుకొచ్చిన సంగతి విదితమే. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఎక్కడికెళ్లినా రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకొస్తామని మాటిచ్చారు. జగన్ హామీ ఇచ్చిన వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ, ఆసరా ఫించన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ తదితర పథకాలను అమలు చేస్తానంటూ 2017లో జగన్ నవరత్నాలను ప్రకటించారు.

అక్రమంగా ఆస్తులు కూడగట్టారనే అభియోగం కింద 2012 మే 27న సీబీఐ.. వైయస్ జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జ‌గ‌న్ చంచ‌ల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్2లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం జగన్ బీకాం వరకు చదివారు. ఆయనపై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసులు చాలా వరకు వీగిపోయాయి.

2019లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని అధికార పార్టీ ప్రభుత్వపరంగా చేసిన కొన్ని పొరపాట్లు వల్ల ఆయన్ని ఏపీ ప్రజలు అధికారానికి దూరంగా ఉంచారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆహ్వానించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు జగన్ పరిపాలనలో రాజీ పడకుండా ముందుకు వెళుతున్నాడు. అందరికీ న్యాయం చేస్తాను ‘‘నేను విన్నాను, నేను ఉన్నాను’’ అంటూ భరోసానిస్తూ దూసుకుపోతున్నాడు. దేశ చరిత్రలో ఎవ్వరూ తీసుకురాని దిశ చట్టాన్ని తీసుకువచ్చి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇంకా అనేక రకాలైన ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.