Amaravati, Nov 10: సచివాలయాల్లో పనిచేసేవారు ప్రత్యేకంగా కనిపించాలన్న ఆలోచనతో ఏపీ ప్రభుత్వం వారికి డ్రస్ కోడ్ అమలు (Dress Code to Village Secretariat Staff) చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పైలెట్ సచివాలయాల కింద కొన్నింటిని గుర్తించి ముందుగా అక్కడి సిబ్బందికి డ్రస్ కోడ్ (Dress Code) అమలు చేయాలని నిర్ణయించింది.అక్కడి సిబ్బంది నుంచి, ఆ సచివాలయాల పరిధిలోని ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ఆధారం చేసుకొని మిగిలిన సచివాలయాల్లో కూడా అమలుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
పురుష ఉద్యోగులకు స్కై బ్లూ షర్ట్, బిస్కెట్ కలర్ ప్యాంట్, మహిళా ఉద్యోగులకు స్కై బ్లూ టాప్, బిస్కెట్ కలర్ లెగిన్ డ్రస్ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద ఒకటి రెండు జిల్లాలను ఎంపికచేసి, అక్కడి ఒకటి రెండు సచివాలయాలకు డ్రస్ కోడ్ అమలు చేస్తోంది. డ్రస్ కోడ్ పట్ల సానుకూల స్పందన లభిస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
దీంతో పాటుగా సచివాలయాల్లో డ్రస్ కోడ్‌ను అమలు చేయనున్న నేపథ్యంలో ఏ క్యాడర్‌కు చెందిన సిబ్బంది ఎవరన్న విషయాన్ని ప్రజలు సులువుగా తెలుసుకునేందుకు ఐడెంటిటీ కార్డుల ట్యాగ్ కలర్‌లను ప్రత్యేకంగా రూపొందిస్తోంది. వార్డు సచివాలయాల్లో దాదాపు పది విభాగాలకు చెందినవారు కార్యదర్శులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. సిబ్బందికి ఇప్పటికే ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. ఐడెంటిటీ కార్డులు ధరించేందుకు ట్యాగ్‌లను వినియోగిస్తారు.
ఒక్కో కార్యదర్శికి ఒక్కో కలర్ ట్యాగ్ ఇచ్చే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని అడ్మిన్ సెక్రటరీ, గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులకు ఎల్లో ట్యాగ్, డిజిటల్ అసిస్టెంట్‌కు రెడ్ ట్యాగ్, హెల్త్ సెక్రటరీకి వైట్ ట్యాగ్, మహిళా పోలీసుకు ఖాకి ట్యాగ్, వీఆర్‌ఓకు బ్రౌన్ ట్యాగ్, అగ్రికల్చరల్/ హార్టీ కల్చరల్ సెక్రటరీకి గ్రీన్ ట్యాగ్, ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఆరంజ్ ట్యాగ్, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కు గ్రే ట్యాగ్ ఇవ్వనున్నారు.