Kakarla Subba Rao: దివంగత ఎన్టీఆర్ పిలుపుతో జన్మభూమికి సేవలందించిన డాక్టర్, ప్రముఖ రేడియాలజిస్ట్ డా. కాకర్ల సుబ్బారావు కన్నుమూత పట్ల సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్
File Image of Late Dr. Kakarla Subba Rao | File Photo

Hyderabad, April 16: ప్రముఖ రేడియాలజిస్ట్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మాజీ డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు శుక్రవారం సికింద్రాబాద్ లోని కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) లో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కాకర్ల నెల క్రితం కిమ్స్‌లో చేరారు. అయితే వైద్యానికి ఆయన శరీరం సహకరించకపోవడంతో ఈ ఉదయం తుది శ్వాస విడిచారని కిమ్స్ వైద్యులు తెలిపారు. చనిపోయే నాటికి కాకర్ల సుబ్బారావు వయసు 94 ఏళ్లు.

ప్రఖ్యాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గా పేరుగాంచిన కాకర్ల సుబ్బారావు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి మొట్టమొదటి డైరెక్టర్ గా 1985 - 1990 మధ్య సేవలందించారు. ఆ తరువాత ఆయన రిటైర్మెంట్ కు ముందు వరకు కూడా 1997 మరియు 2004 మధ్య నిమ్స్ డైరెక్టర్ గా వ్యవహరించారు. నిమ్స్ ఆసుపత్రిని కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి కాకర్ల ఎంతో కృషి చేశారు.

ఏపిలోని కృష్ణా జిల్లాలో గల పెదముత్తేవి గ్రామంలో జన్మించిన డా. సుబ్బారావు, ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ చేద్దామనుకుంటే సీట్ రాలేదు, అయితే మెడిసిన్లో సీట్ వచ్చింది. ఇంట్లో చెప్పకుండా మెడిసిన్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత అనుకోకుండా స్కాలర్ షిప్ ద్వారా రేడియాలజీ కోర్సు చేయడం కోసం అమెరికాలోని న్యూయార్క్ వెళ్లారు. అక్కడే రేడియాలజీపై నైపుణ్యం సాధించారు. అనంతరం అక్కడే న్యూయార్క్ లోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ లో రేడియాలజీ ప్రొఫెసర్ గా పాఠాలు చెప్పారు.

మళ్లీ భారతదేశానికి వచ్చి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో ప్రొఫెసర్ గా, ఛీఫ్ రేడియోలజిస్ట్ గా సేవలందించారు. కొన్ని కారణాలచే తిరిగి మళ్లీ అమెరికాలోనే స్థిరపడ్డారు. అయితే 1984లో ఆనాటి ఏపి ముఖ్యమంత్రి ఎన్.టీ. రామారావు, తెలుగువారు జన్మభూమిలో సేవలు అందించాలని పిలుపునిచ్చారు. నాటి సీఎం మాటలతో ప్రభావితమైన కాకర్ల సుబ్బారావు తిరిగి హైదరాబాద్ వచ్చి

నిమ్స్‌లో చేరారు. తదనంతర కాలంలో నిమ్స్ ను అత్యంత ప్రత్యేకమైన ఆసుపత్రిగా దాని అభివృద్ధికి కృషి చేశారు. వైద్య రంగంలో ఆయన చేసిన విలువైన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో కాకర్ల సుబ్బారావును పద్మశ్రీతో సత్కరించింది.

కాగా,  డా.కాకర్ల సుబ్బారావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. నిమ్స్ డైరక్టర్ గా ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.