Water War: నీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ వాదనలో అర్థం లేదు, కౌన్సిల్ సమావేశంలో పూర్తి ఆధారాలతో నిలదీయాలని అధికారులకు తెలంగాణ సీఎం కేసీఆర్ సూచన
Telangana CM KCR | File Photo

Hyderabad, August 20: ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికున్న అభ్యంతరాలను కూడా కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తుతామని వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం విషయంలో తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు. అజెండాలో చేర్చాల్సిన అంశాలను కూడా ఆ లేఖలో పేర్కొంటామని తెలిపారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసేందుకు సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఇరిగేషన్ నిపుణులు, న్యాయ నిపుణులు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం, ఎపి ప్రభుత్వం లేవనెత్తిన అన్ని సందేహాలను కౌన్సిల్ సమావేశంలో నివృత్తి చేయాలని, దీనికి సంబంధించి సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులనే తెలంగాణ అవసరాలను తీర్చే విధంగా రీడిజైన్ చేశామని సీఎం పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా కౌన్సిల్ సమావేశంలో చెప్పాలని సూచించారు. ఆయా ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఎన్ని నిధులు కేటాయించారు? తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? ఎన్ని టిఎంసిలు కేటాయించారు? తదితర వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం వ్యవహరిస్తున్నదనే విషయాన్ని ఆధార సహితంగా వివరించాలని చెప్పారు.

పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపుతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. నీటి కేటాయింపులు లేకున్నా, అనుమతులు లేకున్నా, ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంలో కూడా సమావేశంలో నిలదీయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నీ అర్థం పర్థం లేనివే అని సీఎం స్పష్టం చేశారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణకు జరుగతున్న అన్యాయాలపై గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేశామని, ఈ సారి జరిగే అపెక్స్ కౌన్సిల్ లో అయినా ఆ అంశాలను చేర్చి న్యాయం చేయాల్సిందిగా కోరుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.