Hyderabad, May 8: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1122కు చేరింది. నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 12 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కాగా, వలస కార్మికుల్లో ఓ ముగ్గురికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జిల్లాల నుంచి కొత్తగా ఎటువంటి కేసులు నమోదు కాలేదు.
అయితే ప్రతీరోజు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నా, మరోవైపు అంతకుమించిన సంఖ్యలో బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుండటం ఊరట కలిగించే విషయం. ఈ రకంగా రాష్ట్రంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ పోతుంది. గురువారం మరో 45 మంది కోవిడ్-19 పేషెంట్లు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 693 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. కొత్తగా కరోనా మరణాలేమి నమోదు కాలేదు, దీంతో మరణాల సంఖ్య 29 గానే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 400 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Telangana's #COVID19 Report:
ఇక ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఆంక్షలు తొలగించడంతో అనుమతించిన దుకాణాలు తెరుచుకున్నాయి. మండల స్థాయి నుంచి గ్రామాలలో పూర్తిగా అన్ని వ్యాపారాలు పున: ప్రారంభమవగా, మున్సిపల్ పరిధుల్లో ఒకరోజు మినహాయించి మరొక రోజు దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నారు. అటు వైన్స్ షాపుల తెరిచే ఉండటంతో చాలా చోట్ల లాక్డౌన్ ఎత్తివేసినంత రద్దీ కనిపించింది. కాగా, రెడ్ జోన్ల ఉన్న హైదరాబాద్ నగరంలో ఆంక్షలేమి సడలించనప్పటికీ పెద్ద ఎత్తున వాహనదారులు రోడ్లపైకి వచ్చారు.