Corona Vaccine Trials in NIMS (Photo-Twitter)

Hyderabad, July 22: భారత‌ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్‌ ( Bharat Biotech) సంస్థ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ ( Covaxin ) క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా జరుగుతున్నాయి. కరోనావైరస్‌ ( Coronavirus ) ను కట్టడి చేసేందుకు మొదటి దశలో భాగంగా దేశంలోని పలు ఆసుపత్రుల్లో ఈ టీకాను దాదాపు 60మంది వలంటీర్లపై ప్రయోగిస్తున్నారు. అయితే ఈ కోవాక్సిన్‌ను సోమవారం ప్రయోగాత్మకంగా తీసుకున్న ఇద్దరు వాలంటీర్లు మంగళవారం హైదరాబాద్ నిమ్స్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ (Covaxin Volunteers Discharged) అయ్యారు. కరోనా వ్యాక్సిన్‌లో ముందడుగు, హైదరాబాద్‌లో నిమ్స్‌లో మానవులపై తొలి ప్రయోగం, 28 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో డోస్‌ తీసుకున్న వ్యక్తి

నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NIMS) లో ఇద్దరు వాలంటీర్లకు కొవాక్జిన్‌ ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో మంగళవారం డిశ్చార్జి చేసినట్టు నిమ్స్‌ వైద్యులు తెలిపారు. 14 రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని నిమ్స్‌లోని కొవాక్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ (Covaxin Clinical Trials) ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. రోజూ ఫోన్, వీడియో కాల్స్‌ ద్వారా వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తామని, తర్వాత మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తామన్నారు. దేశంలో మరణాల రేటు క్రమంగా తగ్గుతోంది, 24 గంటల్లో 37,724 పాజిటివ్‌ కేసులు నమోదు, భారత్‌లో 12 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు

టీకాలోని అచేతన (అన్‌యాక్టివేటెడ్‌) వైరస్‌ వల్ల శరీరంలో యాంటీబాడీస్‌ ఏ మేరకు వృద్ధి చెందాయి, సమస్యలున్నాయా అనేది పరిశీలిస్తామన్నారు. అంతా సవ్యంగా ఉంటే వారికే రెండో డోస్‌ టీకా ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం టీకా తీసుకున్న వారిలో అలర్జీ, ఇతర ఆరోగ్య సమస్యలు లేవన్నారు. కొవాక్జిన్‌ టీకా మానవ ప్రయోగంలో తొలి ప్రయత్నం విజయవంతమైందని నిమ్స్‌ క్లినికల్, ఫార్మకాలజీ విభాగం వైద్యులు హర్షం వ్యక్తంచేశారు.

క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా నిమ్స్‌ వైద్యులు 13 మంది వాలంటీర్ల రక్త నమూనాలను ఢిల్లీలోని ఐసీఎంఆర్‌ ఆమోదించిన ల్యాబ్‌కు పంపించారు. వీరిలో 8 మందికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ అయినట్టు తెలిసింది. ఈ సర్టిఫికెట్ల ఆధారంగానే బుధవారం మరో ఇద్దరికి టీకా డోస్‌ ఇవ్వనున్నారు. దీంతో టీకా తీసుకున్న వారి సంఖ్య నాలుగుకి చేరనుంది. ట్రయల్స్‌లో భాగంగా ఆరోగ్యవంతమైన 60 మందిపై మొదటి, రెండో దశ ప్రయోగాలను నిర్వహించనున్నారు. మూడో దశలో వంద మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఐదు డోస్‌ల మేరకు టీకా ఇస్తారు. టీకా ప్రయోగాన్ని 2 – 3 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. పరీక్షలు విజయవంతమైతే ఈ ఏడాది చివరికి లేదా కొత్త సంవత్సరం ఆరంభంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని నిమ్స్‌ వైద్యులు చెబుతున్నారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్ రెండు దశల్లోనూ మనుషులపై ప్రయోగాలు విజయవంతమైంది. ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లోనూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన మోడెర్నా, యూకేకు చెందిన ఆక్స్‌పర్డ్ యూనివర్సిటీతో పాటు రష్యాకు చెందిన మరో సంస్థ కూడా కరోనా వాక్సిన్ అభివృద్ధిలో ముందు వరసలో ఉన్నాయి. ఇప్పటికే ఫేజ్ 1, 2 హ్యూమన్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేశాయి. టీకా తీసుకున్న వాలంటీర్ల శరీరంలో యాంటీ బాడీలు తయారయ్యాయని.. కరోనాను ఎదుర్కొనేందుకు రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించిందని పరిశోధణనల్లో తేలింది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం ఆ టీకాలు మూడో దశలో ఉన్నాయి.