
Hyderabad, August 2: చదివింది బీటెక్. సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోవనుకున్నాడో ఏమో...ఏకంగా దొంగ బాబా అవతారం (Btech Fake Baba Fraud) ఎత్తాడు.. భక్తులకు మాయమాటలతో టోపీ వేస్తున్న ఓ బురిడీ బాబాను (Cheating People in Telangana) నల్లగొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి (Nalgonda Police Arrests Fake Baba) తీసుకున్నారు. ఈ దొంగ బాబాను నమ్మి మోసపోయిన ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల కథనం మేరకు.. కృష్ణా జిల్లాకు చెందిన సాయి విశ్వ చైతన్య (Sai Vishwa Chaitanya) హైదరాబాదులో పుట్టి పెరిగాడు. అక్కడే బీటెక్ వరకు చదివాడు. అనంతరం విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురం గ్రామస్థులు కొందరు అతడికి భక్తులుగా మారి అతడు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం గ్రామంలో పదెకరాల స్థలాన్ని అందజేశారు. దీంతో ‘శ్రీసాయి సర్వస్వం మాన్సి మహా సంస్థానం’ పేరుతో 2020లో విశ్వచైతన్య ఓ ఆశ్రమాన్ని నెలకొల్పాడు. అక్కడే సాయిబాబా ప్రవచనాలు చెబుతూ, తాయత్తులు కడుతూ, హోమాలు చేస్తూ రూ. కోట్లు దండుకున్నాడు.
10 నెలల వ్యవధిలో విశ్వచైతన్య.. కోట్లాది రూపాయల డబ్బు, బంగారం వెనకేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు తొలగిస్తానని చెప్పి విజయవాడకు చెందిన ఓ మహిళ నుంచి రూ.92 లక్షలు నొక్కేశాడు. అయితే ఆమె ఆరోగ్యం బాగు కాకపోవడంతో సాయి విశ్వ చైతన్య నమ్మించి డబ్బులు తీసుకుని మోసగించాడని ఓ బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఎస్పీ రంగనాథ్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించారు.
ఆశ్రమంలో ఉన్న సాయి విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నగదు, బంగారు ఆభరణాలు, విలువైన డిపాజిట్ బాండ్లు, ల్యాప్టాప్‌లు, ప్రవచన బ క్కులను ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. గత ఆరు నెలలుగా బురిడీ బాబా.. సాయిబాబా భక్తునిగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని పూర్తిస్థాయిలో విచారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.