Hyderabad, April 26: దేశంలోని కొన్ని ప్రాంతాలు అతిపెద్ద కరోనావైరస్ హాట్ స్పాట్ లుగా తయారవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, చైన్నై మరియు ముంబైలోని థానే నగరాల్లో పరిస్థితులను నేరుగా పర్యవేక్షించేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తెలంగాణలో కోవిడ్- 19 వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్ విచ్చేసింది. 3 రోజుల పాటు నగరంలో ఈ బృందం పర్యటించనుంది. తొలిరోజు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది.
తొలిరోజు గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ఏర్పాటు చేసిన 1500 పడకల ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిని తనిఖీ చేశారు, ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు కల్పించే సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఐ.సి.యూ, అత్యవసర వార్డులు, ఐసోలేషన్ వార్డులు, థియేటర్లు,స్టోర్ రూములన్నింటిని పరిశీలించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గ దర్శకాలను అనుసరించి వివిధ ప్రోటోకాల్ కమిటీల ఏర్పాటు చేశారా, కరోనా నివారణ, పాటించాల్సిన జాగ్రత్తలపై మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తదితర అంశాలపై ఆరా తీశారు. తెలంగాణలో 990కి చేరిన మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య
2007లో జరిగిన ప్రపంచ మిలిటరీ క్రీడల సందర్బంగా నిర్మించిన ఈ 14 అంతస్తుల భవనంలో 1500 పడకల ఆసుపత్రిని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కోవిడ్-19 చికిత్స కోసం ఏర్పాటు చేసిందని కేంద్ర బృందానికి అధికారులు తెలియజేశారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రి, కింగ్ కోఠి ఆసుపత్రులను పూర్తి స్థాయి కరోనా పాజిటివ్ కేసులకు సంబందించిన ఐసోలేషన్ ఆసుపత్రులుగా ఉపయోగిస్తున్నామని, ఆయా ఆసుపత్రుల్లో స్థాయిని మించి కేసులు నమోదయిదే గచ్చిబౌలి ప్రత్యేక ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని వివరించారు. కోవిడ్ నివారణ, చికిత్సలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల అనుసరించే చేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం ఈ బృందం నార్సింగిలోని అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రధాన వంటశాలను (మెయిన్ కిచెన్ ) పరిశీలించింది. కరోనా వైరస్ నేపథ్యంలో తమ కేంద్రం ద్వారా ప్రతిరోజూ దాదాపు లక్షన్నర మందికి మధ్యాహ్నం, సాయంత్రం బోజనాలను అందిస్తున్నామని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. జీహెచ్ఎంసీ ద్వారా ఏర్పాటుచేసిన 150 అన్నపూర్ణ క్యాంటిన్ ల ద్వారా ఈ బోజనాలను అందిస్తున్నామని, కరోనా వ్యాధి అనంతరం ఈ అన్నపూర్ణ కేంద్రాలను 200 లకు పెంచారని తెలిపారు. దీనితో పాటు మొబైల్ వాహనం ద్వారా కూడా బోజనాలను అందచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భోజనాల నాణ్యత, హైజినిక్, ట్రాన్స్పోర్టేషన్, పంపిణి తదితర విషయాలను కేంద్ర ప్రతినిధులు అడిగితెలుసుకున్నారు.
ఆనంతరం ఈ బృందం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో సమావేశం అయింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కేంద్ర బృందానికి సీఎస్ సోమేశ్ కుమార్ డిటేల్డ్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.