Amaravati, August 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు దీర్ఘకాలంగా బకాయిపడ్డ (Power Dues Between Telugu States) రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana Govt) కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ డిస్కమ్‌లకు ఏపీ జెన్‌కో (AP GENCO) 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకూ తెలంగాణకు అందచేసిన ఈ విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు దీర్ఘకాలంగా పేరుకుపోయాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఈ బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ విద్యుత్తు సంస్థలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం (Government of Andhra Pradesh) పలు సందర్భాల్లో కేంద్రాన్ని కోరింది.సీఎం జగన్ గత పర్యటనలో ప్రధాని మోదీతో, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఈ విషయంపై చర్చించారు. ఈ నేపథ్యంలో రూ.6,756.92 కోట్ల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి అనూప్ సింగ్ బిస్త్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ జెన్‌కో సరఫరా చేసిన 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ డిస్కమ్‌లు రూ.3,441.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఈ ఏడాది జూలై 31 నాటికి మరో రూ.3,315.14 కోట్లు లేట్ పేమెంట్ సర్ చార్జీ పడింది. ఈ మొత్తం రూ.6,756.92 కోట్లను (power dues rs 6,756.92 ) ఏపీకి చెల్లించాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ల (ఆర్‌ఈసీ) నుంచి 2014 జూన్ 2 నుంచి 2017 మార్చి 31 మధ్య రూ.5,625 కోట్ల రుణాలను ఏపీ జెన్‌కో తీసుకుంది. అలా తీసుకున్న డబ్బులతోనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయగలిగింది. కానీ వాడుకున్న విద్యుత్‌కు తెలంగాణ డిస్కమ్‌లు డబ్బులివ్వకపోవడంతో పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలకు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఏపీజెన్‌కోకు ఏర్పడింది.
కాగా 2019 ఆగస్టు 19న జరిగిన ఇరు రాష్ట్రాల సంయుక్త సమావేశంతో పాటు పలు సందర్భాల్లో ఏపీకి బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ డిస్కమ్‌లు ఒప్పుకున్నాయి. 2020 జనవరిలో జరిగిన ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ బకాయిల అంశాన్ని చర్చించారు.అయినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.