Hyderabad, November 28: సీఎం కేసీఆర్ తాజా ప్రకటన ఈ లింక్ లో చూడొచ్చు సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం మంత్రివర్గం భేటీ (Cabinet Meet) అయింది. 50 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేబినేట్ ప్రత్యేకంగా చర్చించనుంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు కేబినేట్ సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే తొలిరోజు ఆర్టీసీ ప్రైవేటీకరణ, కార్మికుల భవితవ్యంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ (Transport System) ఎలా ఉంది, అక్కడ అమలవుతున్న విధానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఇప్పటికే సమ్మె విరమించిన 48 వేల ఆర్టీసీ కార్మికులు, తమను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. గతంలో రెండు సార్లు అవకాశం ఇచ్చినా, సద్వినియోగం చేసుకోని ఆర్టీసీ కార్మికుల పట్ల ఎలా వ్యవహరించాలి? వీరి అంశాన్ని లేబర్ కోర్టుకు పంపించాలా, వద్దా? అనే అంశంపై రాష్ట్ర కేబినేట్ ఒక నిర్ణయానికి రానుంది. ఆర్టీసీ సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు బదిలీ చేసే అంశాన్ని రెండు వారాల్లో తెలియపరచాలని ఇదివరకే హైకోర్ట్ (High Court of Telangana) సూచించింది. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె అంశం పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఈ నేపథ్యంలో కార్మికులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠత నెలకొంది.
ప్రస్తుతం ఆర్టీసీ నిర్వహణ భారంగా మారిందని ప్రభుత్వం చెబుతున్న తరుణంలో వేల మంది ఆర్టీసీ కార్మికులను తిరిగి కొనసాగించాలా? లేక కొంతమందికి వేలంటరీ రిటైర్మెంట్ ప్రకటించాల అనే దానిపై ఈ కేబినేట్ భేటీలో మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. అయితే అంతిమ నిర్ణయం మాత్రం సీఎం కేసీఆరే తీసుకోనున్నారు. అయితే, ఇక ముందు ఆర్టీసీలో శాశ్వత నియామకాలను నిలిపివేయాలని ప్రభుత్వ ఆలోచనగా తెలియవస్తుంది.
ఇక ఇప్పటికే రూట్ల ప్రైవేటీకరణలో భాగంగా కొత్త ఆర్టీసీ పాలసీ ప్రవేశపెట్టే నిర్ణయానికి వచ్చిన సర్కార్, ఇప్పటికే వెల్లడించిన 5,100 రూట్లను పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రూట్ల ఎంపిక కూడా ఖరారైంది. దీనికి కేబినేట్ ఆమోదం లభించి, జీవో విడుదలయిన తర్వాత ఈ విధానం ఎప్పట్నించి అమలులోకి రానుందో తెలిసే అవకాశం ఉంది.