Telangana: కోవిడ్‌ను జయించిన తెలంగాణ సీఎం కేసీఆర్, నేడు వైద్యారోగ్య శాఖపై అధికారులతో సమీక్ష; రాష్ట్రంలో కొత్తగా 6,361పాజిటివ్ కేసులు నమోదు
Telangana CM KCR | File Photo.

Hyderabad, May 5:  తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యులు డా. ఎం. వి రావు వెల్లడించారు. గత నెల 14న కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్పట్నించి ఆయన హోంక్వారంటైన్‌లో భాగంగా ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో వైద్య బృందం పర్యవేక్షణలో ఉంటున్నారు. మంగళవారం కేసీఆర్‌కు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు రెండింటిలోనూ నెగిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. రక్తపరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నాయని తేలింది. దీంతో సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు. బుధవారం నుంచి ఆయన విధుల్లో పాల్గొనవచ్చునని డాక్టర్ల బృందం సూచించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను తన ఆధీనంలోకి తెచ్చుకున్న సీఎం ఈరోజు ఆ శాఖపై అధికారులతో సమీక్ష జరపనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో కోవిడ్ స్థితిగతులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన అంశాలపై సీఎం చర్చించనున్నారు.

ఇక, తెలంగాణలోని కోవిడ్ కేసులను పరిశీలిస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 77,435 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 6,361 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 3,882 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 4,69,722కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,225 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 422 కేసులు, రంగారెడ్డి నుంచి 423, నల్గొండ నుంచి 453 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 51 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,527కు పెరిగింది.

అలాగే నిన్నటివరకు మరో 8,126 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,89,491 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.