Hyderabad, July 26: తెలంగాణ దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెలంగాణ దళితబంధు కార్యక్రమంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితబంధువులతో ప్రగతి భవన్‌లో (CM KCR Hold Review Meeting ) సమావేశమయ్యారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రతినిధులు అక్కడ సాధించే విజయం మీదే.. యావత్ తెలంగాణ దళితబంధు (Telangana Dalit Bandhu) విజయం ఆధారపడి ఉందన్నారు. అందరూ ఆ దిశగా దృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘‘దళితబంధు కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం. మంచి కార్యక్రమానికి ప్రతికూల శక్తులు ఉంటాయి. మనలో పరస్పర సహకారం పెరగాలి.. ద్వేషాలు పోవాలి’’ అని సూచించారు. ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం.. భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించినట్లు గుర్తు చేశారు. ప్రతీ విషయంలో అడ్డుపడే శక్తులు ఎప్పుడూ ఉంటాయని.. తాను నమ్మిన ధర్మానికి కట్టుబడి ప్రయాణం కొనసాగించినప్పుడే విజయం సాధ్యమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందన్నారు.
మనిషిపై మనిషి వివక్ష చూపే దుస్థితి గురించి.. సెంటర్ ఫర్ సెబాల్టర్న్ స్టడీ ద్వారా అధ్యయనం చేసినట్లు చెప్పారు. దళితవాడల్లో ఇప్పటికే నమోదైన పరస్పర కేసులను పోలీస్‌స్టేషన్లలో రద్దు చేసుకోవాలని సూచించారు. పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలని, అప్పుడే మన విజయానికి బాటలుపడుతాయన్నారు. సమావేశంలో నియోజకవర్గానికి చెందిన 412 మంది దళితబంధువులతో పాటు 15 మంది రీసోర్స్ పర్సన్లు, అధికారులు పాల్గొన్నారు.