CM KCR Warangal Tour: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్, కోవిడ్ బాధితులకు పరామర్శ, ఆసుపత్రిలో వైద్యసేవలు, ఆక్సిజన్ సరఫరాపై ఆరా
CM KCR at Warangal MGM COVID Ward | Photo: Facebook

Warangal Urban, May 21:  వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రిని సందర్శించారు. నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. అనంతరం సీఎం జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు.

ఎంజీఎం ఆసుపత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, కరోనావైరస్ చికిత్సలో అవసరమైన ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్లు మరియు ఇతర అవసరాల గురించి సీఎం ఆరా తీశారు. ఎంత ఖర్చయినా సరే రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Watch CM Inspection at MGM

అలాగే , ఆసుపత్రిలో వైద్య సేవలు డాక్టర్లు, ఇతర సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన సీఎం, జైల్లోని ఖైదీల మంచిచెడుల గురించి తెలుసుకుంటూ వారి నేరకారణాలను విచారించారు. జైల్లోని సౌకర్యాలను మరియు ఖైదీలు తయారు చేసిన చేనేత ఉత్పత్తులు, పలు రకాల వస్తువులను పరిశీలించారు.