Nagarjuna Sagar, Feb 10: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించారు. నెల్లికల్లులో 13 ఎత్తిపోతల పథకాలకు, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన (CM KCR Nellikal Inauguration) చేశారు. ఈ పర్యటనలో భాగంగానే డిగ్రీ కళాశాలకు సంబంధించిన 12 శిలాఫలకాల ఆవిష్కరించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర నాయక్‌తో పాలు పలువురు నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకాలతో (lift Irrigation schemes) చివరి భూములకు కృష్ణాజలాలు అందుతున్నాయన్నారు. హుజూర్‌నగర్, సాగర్, దేవరకొండ పరిధిలోని చివరి భూములకు నీరు అందుతుందన్నారు. ఎత్తిపోతల ద్వారా యాదాద్రి జిల్లాలో గందమల్ల, బస్వాపూర్‌కు లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ ఎత్తిపోతల పథకాలతో హుజూర్‌నగర్, సాగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,04,600 ఎకరాల టెయిల్‌లాండ్ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్ ఇరిగినేషన్ ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఈ పథకాలకు ఇటీవల రూ.3వేల కోట్ల నిధులు మంజూరు చేస్తూ సీఎం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా జిల్లాలో 55వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందనుంది.
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సన్నాహాల్లో భాగంగా (CM KCR Nagarjuna Sagar Tour) బుధవారం హాలియాలో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యే ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందిని సమీకరించడం లక్ష్యంగా టీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇటీవల నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కావడం, వచ్చే నెల రోజుల్లో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాతోపాటు తెలంగాణ ప్రజలపై వరాల జల్లు కురిపించనున్నట్లు సమాచారం