Hyderabad, May 28: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు (COVID-19 in Telugu States) పెరిగిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో 5 వేలకు చేరువలో కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో రికార్డు స్థాయిలో 107 కొత్త కేసులు నమోదు కాగా ఏపీలో 54 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసులు సంఖ్య 2098కు చేరుకోగా ఏపీలో 2841కి చేరుకున్నాయి. రెండు రాష్ట్రాల కరోనా కేసులను కలుపుకుంటే 4939గా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో 30 వేల పెళ్లిల్లు వాయిదా, దేశంలో లక్షా యాభై ఎనిమిది వేలు దాటిన కరోనా కేసులు, మొత్తం మరణాల సంఖ్య 4531
ఇక రాష్ట్రాల వారీగా కేసులను ఓ సారి పరిశీలిస్తే..
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ( Andhra Pradesh) సంబంధించిన కరోనా హెల్త్ బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 54 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఒకరు మృతి చెందారు. తాజాగా నమోదైన కేసుల్లో ఎనిమిది కోయంబేడు లింకులు ఉన్నాయి. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 59 మంది చనిపోయారు. ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు 824 కాగా, 1,958 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
తెలంగాణ
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus cases in Telangana ) మళ్లీ విజృంభిస్తోంది. బుధవారం రాష్ట్రంలో కొత్తగా మరో 107 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిలో 49 మందికి కరోనా సోకినట్టు గుర్తించగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసకూలీలలోనూ 19 మందికి ( Migrant workers ) కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ సోకిన వారి సంఖ్య మెత్తం 2098కి చేరింది. వీళ్లలో ప్రస్తుతం 714 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కరోనాతో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1321 కి చేరుకుంది.తెలంగాణలో కరోనాతో బుధవారం నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 63 కి చేరింది.
మంచిర్యాలలో నలుగురికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో ఇద్దరు ముంబై నుంచి రాగా.. ఆ ఇద్దరి నుంచి మరో ఇద్దరికి సోకింది. జగిత్యాల జిల్లాలో మరో 12 మందికి, రంగారెడ్డి జిల్లాలో 6, రాజన్న సిరిసిల్లలో 3, మహబూబ్‌నగర్, ఖమ్మం, నాగర్‌కర్నూల్, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్టు ఆయా జిల్లాల అధికారులు ప్రకటించారు.
కరోనావైరస్ విషయంలో ప్రజలు భయాదోంళనలకు గురి కావాల్సిన పనిలేదని, లాక్ డౌన్ రూల్స్ సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి అధికంగా ఏమీ లేదని, అయినప్పటికీ ప్రజలు అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకవేళ రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి అధికమైనప్పటికీ, తగిన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ప్రకటించారు.