Hyderabad, April 21: తెలంగాణలో మంగళవారం కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 928కి పెరిగింది. సూర్యాపేట జిల్లాలో కరోనావైరస్ కోరలు చాస్తోంది, ఈరోజు నమోదైన పాజిటివ్ కేసుల్లో సూర్యాపేట జిల్లా నుంచే 26 పాజిటివ్ కేసులు రావడం ఆందోళన కలిగించే విషయం. దీని తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 19 కేసులు, నిజామాబాద్ నుంచి 3, జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి 2, ఆదిలాబాద్ నుంచి 2, రంగారెడ్డి, ఖమ్మం, మేడ్చల్, వరంగల్ జిల్లాల నుంచి ఒక్కో కేసు చొప్పున కొత్తగా నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇదిలా ఉంటే, ఈరోజు మరో 8 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 192 మంది డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లిపోగా , చికిత్స పొందుతూ 23 మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రస్తుతం రాష్ట్రంలో 711 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
సీఎం కేసీఆర్ సమీక్ష, జిల్లాల్లో పర్యటించాలని ఉన్నతాధికారులకు ఆదేశం
మరోవైపు కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. జిల్లాలు, పట్టణాలు మరియు గ్రామీణ స్థాయిలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలవుతున్న తీరు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మే 7 వరకు ఎక్కడి వాళ్లు అక్కడే, ఎవరూ తెలంగాణలోకి అడుగుపెట్టవద్దు- సీఎం కేసీఆర్
కేసులు ఎక్కువగా నమోదవుతున్న గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సీఎం సూచించారు.
సీఎం ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు బుధవారం సూర్యాపేట, గద్వాల్ మరియు వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు.