Nizamabad, April 17: నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం వాడి గ్రామంలో (Wadi village of Velpur mandal in Nizamabad) విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామంలోని ఓ కుటుంబ సభ్యులు నలుగురు కరోనా వైరస్ కారణంగా (Coronavirus kills four of family) మరణించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు పదకంటి లింబాద్రి(65), నర్సవ్వ(61). వీరికి ముగ్గురు కొడుకులు. దంపతులిరువురి కొవిడ్‌తో మృతిచెందగా వీరి రెండవ కుమారుడు సుదర్శన్(40) రెండు నెలలక్రితం కొవిడ్ పాజిటివ్‌తో చనిపోయాడు. దంపతుల మరో కొడుకు రమేశ్(45) సైతం మూడు రోజులక్రితం కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌తోనే కాలం చేశాడు. దీంతో జిల్లా వైద్యారోగ్య అధికారులు వాడి గ్రామంలో కొవిడ్-19 క్యాంప్‌ను ఏర్పాటు చేసి గ్రామస్థులకు పరీక్షలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ (Covid Second Wave) ప్రభావం దేశ వ్యాప్తంగా చాలా తీవ్రంగా ఉందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఒకే రోజు రెండు లక్షల కేసులు నమోదు కావడం ఆందోళనను పెంచుతోందని చెప్పారు. రాననున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కరోనా దెబ్బకు అగ్ర దేశాలు కూడా అల్లాడుతున్నాయని... వాటితో పోల్చితే తక్కువ వసతులు ఉన్న మనం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలి నుంచి విస్తరించే స్థాయికి వైరస్ చేరుకుందని హెచ్చరించారు.
తొలి వేవ్ తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని, ఇదే సమయంలో మహమ్మారి మరింత బలాన్ని పుంజుకుందని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వైరస్ మ్యుటేషన్లుగా, డబుల్ మ్యుటేషన్లుగా ఏర్పడి వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. అయితే ఫిబ్రవరి నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని తెలిపారు. కరోనా చికిత్సకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో బెడ్లు, ఔషధాలు, ఆక్సిజన్ కు కొరత లేదని తెలిపారు. 116 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సలను అందిస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు.
గతంలో కరోనా సోకిన వ్యక్తిని ఇంట్లో ఐసొలేట్ చేస్తే సరిపోయేదని... ఇప్పుడు ఇంట్లో రోగిని గుర్తించేలోగానే కుటుంబమంతా వైరస్ కు గురవుతోందని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. 15 రోజుల్లోనే పాజిటివిటీ రేటు డబుల్ అయిందని తెలిపారు.