TS Covid: తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్, ఇకపై గాంధీ ఆస్పత్రి పూర్తిగా కరోనా పేషెంట్లకే, తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం, ఒక్కరోజే కోవిడ్‌తో 12 మంది మృతి, తాజాగా 4,446 మందికి కరోనా పాజిటివ్
Image of Gandhi Hospital, COVID19 Outbreak in Telangana. | Photo: Twitter

Hyderabad, April 17: తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... 4,446 మందికి కరోనా పాజిటివ్ (TS Coronavirus) నిర్ధార‌ణ అయింది. ఒక్క‌రోజులో కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,414 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,331కి (Covid Cases in TS) చేరింది.

ఇప్పటివరకు మొత్తం 3,11,008 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,809గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 33,514 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 22,118 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 598 మందికి క‌రోనా సోకింది.

రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటం, మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని (Gandhi Hospital) మళ్లీ పూర్తి స్థాయి కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్‌ సేవలు, సర్జరీలు నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్న సాధారణ రోగులను డిశ్చార్జి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో గాయపడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నవారిని ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు.

తుమ్మినా, దగ్గినా కరోనా, గాలి నుంచి వేగంగా శరీరంలోకి, ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం, బ్రిటన్‌కు పాకిన ఇండియా డబుల్ మ్యూటెంట్ వైరస్, రెండోసారి కరోనా బారిన సీఎం యెడ్డ్యూరప్ప, దేశంలో తాజాగా 2,34,692 మందికి కోవిడ్

గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు 24 గంటల్లో 22 మంది కరోనాతో మృతి చెందారు. ఇందులో ఐదుగురు హైదరాబాద్‌కుచెందిన వారు కాగా.. మిగతా 17 మంది వివిధ జిల్లాలకు చెందిన వారు. మరణాల సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరుగుతుండడంతో.. కొవిడ్‌ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయవద్దని, సమీపంలోని యూపీహెచ్‌సీల్లో పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్‌ వరకు గాంధీ ఆస్పత్రి పూర్తిస్థాయి కోవిడ్‌ సెంటర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వైద్య విద్యార్థుల అభ్యర్ధన మేరకు.. జనవరి నుంచి సాధారణ ఓపీ, ఇన్‌పేషెంట్‌ సేవలను కూడా ప్రారంభించారు. మొత్తం 1,890 పడకల్లో 300 పడకలను కోవిడ్‌ విభాగానికి కేటాయించి, మిగతా సేవలు అందించారు. అయితే కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. గాంధీలో కోవిడ్‌ బెడ్లను కూడా పెంచుతూ వచ్చారు.

తెలంగాణలో మోగిన మినీ మునిసిపల్‌ ఎన్నికల నగారా, రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలకు ఏప్రిల్‌ 30న పోలింగ్, మే 3న ఓట్ల లెక్కింపు

తాజాగా మళ్లీ పూర్తిస్థాయి కోవిడ్‌ సెంటర్‌గా ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో ఒక్క రోజే 152 మంది హెల్త్‌ సీరియస్‌గా ఉన్న కరోనా రోగులు అడ్మిట్‌ కావడం ఆందోళనకరంగా మారింది. గాంధీలో 400 వెంటిలేటర్, 1,250 ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రోగుల సంఖ్య మరింత పెరిగితే ఓపీ విభాగం, లైబ్రరీ భవనాల్లో మరో 300 బెడ్లు అదనంగా ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి అధికారులు రంగం సిద్ధం చేశారు.