Hyderabad, June 4: హైదరాబాద్, గచిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి ఐసియూలో కొత్తగా ఏర్పాటు చేసిన 150 పడకలను ఐటీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో ఉంది. లాక్డౌన్ ముగిసే సమయానికి సెకండ్ వేవ్ దాదాపు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని వైద్యులు అంచనా వేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. జూన్ 9 తర్వాత తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత?
ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగడానికి కేంద్ర ప్రభుత్వమే విధానాలే కారణమని కేటీఆర్ విమర్శించారు. దేశంలో తయారవుతున్న దాదాపు 25 శాతం వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి అవుతుందని మంత్రి ఆరోపించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 50 కోట్ల డోసులను వెంటనే విడుదల చేసి ప్రజలను మహమ్మారి నుంచి రక్షించాలని టీఎస్ మంత్రి కేటిఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులతో సూపర్-స్ప్రేడర్లకు ప్రాధాన్యత క్రమంలో టీకాలు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Telangana's COVID19 Bulletin:
ఇక, రాష్ట్రంలోని కేసులను పరిశీలిస్తే.. తెలంగాణలో శుక్రవారం 2,175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారి నుంచి ఈరోజు మరో 3,821 మంది బాధితులు కోలుకోగా, చికిత్స పొందుతూ మరో 15 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 ఆక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ తన నివేదికలో వెల్లడించింది.
ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 253 మందికి కోవిడ్ కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లా నుంచి 178 , ఖమ్మం జిల్లా నుంచి 144, కరీంనగర్ జిల్లా నుంచి 113, భద్రాద్రి కొత్తగూడెం నుంచి 110 మరియు రంగారెడ్డి నుంచి 101 కేసుల చొప్పున నమోదయ్యాయి.