Rowdy-Sheeters Join Traffic Management Duty (Photo-X)

సమాజంలో మార్పు తీసుకురావాలంటే కఠిన శిక్షలు మాత్రమే సరిపోవు, మార్పు అవకాశాలు కూడా ఇవ్వాలి. నేర చరిత్ర ఉన్నవారికి కొత్త జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో రాచకొండ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు పోలీసు నిఘా కంటిలో ఉండే రౌడీషీటర్లను ఇప్పుడు సమాజ సేవలో భాగస్వాములను చేస్తూ, నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలు అప్పగించారు. నేర ప్రవృత్తి నుండి వారిని పూర్తిగా దూరం చేయడం, వారికి సామాజిక బాధ్యతను నేర్పించడం, పౌరులతో మెలిగే అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు.

బుధవారం ఈ కార్యక్రమం తొలి దశ ప్రారంభమైంది. మొత్తం 60 మంది రౌడీషీటర్లను ఎంపిక చేసి ట్రాఫిక్ విధుల్లో ప్రవేశపెట్టారు. ఉప్పల్, ఎల్బీనగర్ మరియు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కో కేంద్రానికి 20 మంది చొప్పున నియమించారు. వీరు ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీ సమయాల్లో ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలను నియంత్రించి, పాదచారులకు సురక్షిత మార్గదర్శన చేస్తూ, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, ఓవర్ స్పీడ్ ప్రమాదాలు, మద్యం సేవించి వాహనం నడిపే ప్రమాదాల గురించి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు, తెలంగాణ పోలీసు శాఖ కీలక ఆదేశాలు, ముందస్తుగా సెలవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచన

ఈ బాధ్యతలను నిరవధికంగా అందరికీ ఇవ్వడం లేదు. గత కొన్ని నెలలుగా ఎలాంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనకుండా, శాంతియుతంగా ప్రవర్తిస్తూ, మార్పు పట్ల ఆసక్తి చూపుతున్న వారినే కఠిన ప్రమాణాలతో ఎంపిక చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసిన చాలా మంది పౌరులు కూడా ఆశ్చర్యంతో పాటు ప్రశంసలు అందిస్తున్నారు. చట్టంతో సమస్యలు ఎదుర్కొన్న వారు ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణలో సహాయం చేస్తుండటం ఒక స్ఫూర్తిదాయక దృశ్యంగా కనిపిస్తుంది.

రాచకొండ పోలీస్ కమిషనర్‌ శ్రీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. శిక్షతో పాటు మార్పు కోసం అవకాశాలు ఇవ్వడం కూడా పోలీసుల బాధ్యత. రౌడీషీటర్లను సమాజానికి తిరిగి దగ్గర చేసే ప్రయత్నమే ఇది. వారికి మనం చేసిన నమ్మకం, వారికి మంచి జీవితం కోసం మార్గం చూపుతుంది. ఈ కార్యక్రమం వారి మానసిక స్థితిలో పెద్ద మార్పు తీసుకువస్తుందని నమ్ముతున్నాం. రానున్న రోజుల్లో మరింత మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని తెలిపారు.

ఈ వినూత్న ప్రయోగం ద్వారా నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించి, వారిని గౌరవప్రదమైన జీవితానికి దగ్గర చేయాలనేది పోలీసుల ఆశయం. సమాజంలో సానుకూలంగా మెలగడానికి అవకాశం లభిస్తే, నేరగాళ్లుగా పేరు పొందినవారు కూడా మంచిపౌరులుగా మారగలరనే నమ్మకానికి ఇది సాక్ష్యం. రాచకొండ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శిక్షింపడం కంటే మార్చడం, దూరం చేయడం కంటే దగ్గర చేయడం — ఈ కార్యక్రమం అందుకు గొప్ప ఉదాహరణ.