Hyderabad, February 05: హైదరాబాద్ నగరవాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జూబ్లీ బస్ స్టేషన్- మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మెట్రో మార్గం (JBS- MGBS Metro) ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ (CM KCR) శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జెండా ఊపి ఈ సర్వీసును ప్రారంభించనున్నారు. దీంతో జేబీఎస్ - ఎంజీబీఎస్ మధ్య ప్రయాణం సులభతరం కావడమే కాకుండా, సమయం కూడా ఆదా అవుతుంది.
జేబీఎస్- ఎంజీబీఎస్ మధ్య మొత్తం 9 స్టేషన్లు ఉండనున్నాయి. మార్గం ఈ విధంగా ఉంటుంది. జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్‌టీసి క్రాస్‌రోడ్స్, చిక్కడ్‌పల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ మరియు ఎంజీబీఎస్. తర్వాత ఇది ఫలక్ నుమ వరకు విస్తరించబడుతుంది.
హైదరాబాద్ మెట్రోలో ఉచిత వీడియో స్ట్రీమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ఇప్పటికే ఎల్బీ నగర్-మియాపూర్ మరియు నాగోల్-రాయదుర్గ్ కారిడార్లలోని సేవలతో నగరంలో తూర్పు- పడమర కనెక్టివిటీని కలుపగా. ఇప్పుడు ఈ జేబీఎస్-ఎంజీబిఎస్ మార్గం నగరంలోని ఉత్తర- దక్షిణ కనెక్టివిటీని కల్పించినట్లవుతుంది. అంతేకాకుండా నగరంలో 69 కిలోమీటర్ల నెట్‌వర్క్ తో మెట్రో ప్రాజెక్టు మొదటి దశ పూర్తయినట్లు సూచిస్తుంది.
చౌకబారు ప్రచారం చేయొద్దు- సీఎం కేసీఆర్
సామాను రవాణా చేసే తెలంగాణ ఆర్టీసీ కార్గో (TSRTC Cargo) బస్సులపై తన ఫోటోలు పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరగడంపై సీఎం కేసీఆర్ తప్పు పట్టారు. సామాను రవాణాకు ఆర్టీసీ కార్గో బస్సులను ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యం అన్నారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఈ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ద్వారా ప్రజలు లబ్ది పొందాలే తప్ప, దాంతో చౌకబారు ప్రచారం పొందడం తమ అభిమతం కాదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. కార్గో బస్సులపై సీఎం ఫోటో ఉండకూడదని సూచించారు.
ఇటీవల రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీఎస్ ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్ సీఎం కేసీఆరే అని, ఇకపై ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తాం, త్వరలో ప్రారంభం కాబోయే ఆర్టీసీ కార్గో బస్సులపై సీఎం కేసిఆర్ చిత్రపటాలతో పాటు ప్రజలు ఆర్టీసి బస్సులను ఇష్టపడేలా సూక్తులు, ప్రగతి నినాదాలు కనిపిస్తాయని మంత్రి అన్నారు. దీంతో కార్గో సర్వీసులపై సీఎం కేసీఆర్ ఫోటోలు అంటూ కొన్ని మీడియా హౌజ్ లు ప్రధానంగా వార్తలు వేశాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలను తప్పుబడుతూ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.