
Hyd, Oct 6: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 13వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయి 21వ తేదీ వరకు స్వీకరించనున్నారు.అక్టోబర్ 22న నామినేషన్లను స్క్రుటినీ చేస్తారు. వచ్చే నెల 11వ తేదీన ఉప ఎన్నిక నిర్వహిస్తారు. 14వ తేదీన కౌంటింగ్ చేసి, ఫలితాలు విడుదల చేస్తారు.
2023లో బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ ఏడాది జూన్‌లో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. అందువల్ల ఈ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్ నుంచి ఆయన సతీమణి సునీతా గోపీనాథ్ కు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సి.ఎన్. రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ పోటీకి సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం నవీన్, బొంతు, సి.ఎన్. రెడ్డిలలో ఒకరిని త్వరలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ లో రాజకీయ వాతావరణాన్ని మరోసారి ఉత్కంఠగా మార్చే అవకాశం ఉంది, ముఖ్యంగా బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది.