Financial Distress: ఆత్మాభిమానం ముగ్గురిని చంపేసింది, పెళ్లి కుదిరినా చేతిలో డబ్బులు లేకపోవడంతో కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో విషాద ఘటన
Representational Image (Photo Credits: ANI)

Khammam, Dec 12: అమ్మాయికి పెళ్లి కుదిరింది. చేతిలో డబ్బులు లేవు అయినవారిని అడగాలంటే ఆత్మాభిమానం అడ్డు వచ్చింది. దీంతో ఆ తల్లి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం గాంధీచౌక్‌లో నివాసం ఉంటున్న గోవిందమ్మ, ప్రకాశ్ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ కుటుంబం 20 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం వరంగల్‌ నుంచి ఖమ్మం వచ్చింది.

ప్రకాశ్‌ మహబూబాబాద్‌లో స్వర్ణకార వృత్తిని చేస్తుండగా లాక్‌డౌన్‌ కారణంగా 6 నెలలుగా పనులు లేకపోవడం.. లాక్‌డౌన్‌ నుంచి బయటపడ్డా చేతినిండా పనిలేక ప్రకాశ్‌ కుటుంబానికి ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఈ సమయంలోనే జనగామలోని వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి రాధికను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. నిశ్చయతాంబూలాలు సైతం పూర్తయ్యాయి. జనవరి 11న పెళ్లి జరగాల్సి ఉంది. లాంఛనాలు లేకుండా పెళ్లి చేసుకోవడానికి వరుడు ఒప్పుకున్నా.. గోవిందమ్మ కుటుంబం మాత్రం తన పిల్లను వట్టి చేతులతో ఎలా పంపాలని 10 రోజులుగా కుమిలిపోయింది.

పెద్దలకు తెలియకుండా పెళ్లి, ఒప్పించేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో జంట మృతి, మరో చోట పెద్దలు పెళ్లికి ఒప్పుకోరనే భయంతో ప్రేమికులు ఆత్మహత్య

రెండు రోజుల్లో ఇంటికి భోజనాలకు వస్తామని.. బట్టలు కలిసి సెలెక్ట్‌ చేద్దామని వరుడి కుటుంబం సమాచారమివ్వడంతో వీరు మరింత కలత చెందారు. పెళ్లి వారికి మర్యాదలు చేయడానికి కూడా చేతిలో డబ్బులు లేకపోవడంతో గోవిందమ్మ తన ఇద్దరు కూతుర్లు కలిసి రాత్రి 11 గంటల సమయంలో బంగారాన్ని మెరుగు పెట్టేందుకు వాడే సైనేడ్‌ ద్రావణాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి 11.30 గంటలకు ప్రకాశ్‌ మహబూబాబాద్‌ నుంచి ఇంటికి రాగా.. ఎంతకూ తలుపులు తీయలేదు.

క్యాన్సర్‌తో మరణించిన పెద్ద కొడుకు, తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య, తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో విషాద ఘటన

దీంతో అనుమానం వచ్చి నగరంలోనే ఉండే తన తోడల్లుడైన చిదంబరానికి ఫోన్‌ చేశారు. ఆయనతోపాటు బంధువులు వచ్చి త్రీటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా.. ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రకాశ్‌ ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ సీఐ శ్రీధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి పెద్దను బలి తీసుకున్న కరోనా, మనస్తాపంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని పసివేదలలో విషాద ఘటన

ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ సమయంలో ప్రకాశ్‌ కుటుంబానికి స్వర్ణకారుల యూనియన్‌ చేదోడువాదోడుగా ఉంది. ప్రకాశ్‌కు ముగ్గురు సోదరులు, గోవిందమ్మకు ఏడుగురు అక్కాచెల్లెళ్లు.. వారిని సాయం అడిగేందుకు ఆత్మాభిమానం అడ్డొచ్చింది. రాధిక పెళ్లికి అయిన వారందరూ తలా ఒక చేయి వేస్తారని భరోసాగా ఉన్నా.. పెళ్లి సమయం దగ్గర పడుతుండటం.. ఆశించిన వారి నుంచి సరైన స్పందన లేకపోవడం వారిని ఆత్మహత్యకు పురిగొల్పినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులు రాధిక, రమ్య తాత్కాలిక ఉద్యోగులుగా స్థానిక పోస్టాఫీస్‌లో పనిచేశారు. అయితే సాయం చేస్తారనే నమ్మకం లేకపోవడంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీరు ఎవరితోనూ పంచుకోలేదని తెలుస్తోంది.