Hyderabad, July 31: దళితుల సమగ్రాభివృద్ధికోసం బృహత్ సంకల్పంతో రూపొందించిన దళిత బంధు పథకాన్ని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తరతరాలుగా సమాజంలో నిర్లక్ష్యానికి గురైన దళితుల జీవితాలను పూర్తిగా మార్చివేసేందుకే ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా ఈ పథకానికి రూపకల్పన చేశామని తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి (E Peddi Reddy Joins TRS) ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు.
తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పెద్దిరెడ్డితోపాటు టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి స్వర్గం రవిలకు సీఎం గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి నాకు సన్నిహితుడు, ఇద్దరం కలిసి ఒకేసారి మంత్రులుగా పనిచేశాం. ప్రజాసంక్షేమంలో భాగస్వామ్యం కావడానికే ఆయన టీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో పెద్దిరెడ్డి భాగస్వామిగా, చేదోడువాదోడుగా ఉంటారు’’ అని సీఎం తెలిపారు. పెద్దిరెడ్డితో పాటు కాంగ్రెస్ నేత సర్గం రవి, ఇతర నేతలు టీఆర్ఎస్ లో చేరారు.
దళితబంధు పథకం (Telangana Dalit Bandhu Scheme) మహాయజ్ఞమని, ఆరునూరైనా అది ఆగదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ఎవరాపుతారో తాను చూస్తానని పేర్కొన్నారు. ఒక్కసారి కేసీఆర్ చెప్పాడంటే అది జరిగి తీరుతుందన్నారు. దాన్ని దశల వారిగా.. మన ఆర్థిక పరిమితులను బట్టి ఏడాదికి రెండు నుంచి నాలుగు లక్షల కుటుంబాలను ఆదుకోవాలని ప్రణాళికలు రూపొందించామన్నారు. అందుకే దీనికి రూ. లక్ష కోట్లు అయినా ఖర్చు పెడతామని ప్రకటించానన్నారు. దళితబంధు (Telangana Dalitha Bandhu) అంటే బాంబు పడ్డట్లు ప్రతిపక్షాలు భయపడుతున్నాయని తెలిపారు. తనను చంపినాసరే.. అబద్ధాలు చెప్పి మోసం చేయనన్నారు. చేనేత కార్మికులకు ప్రకటించిన బీమా పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు.
కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని, ఇప్పుడు తెలంగాణ సరైన దారికి చేరిందని, ఈ ప్రస్థానం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని అన్నారు. మంచి, చెడు తెలిసిన ప్రజలే అన్నింటినీ కాపాడుకుంటారని తెలిపారు. ఏనుగు పోతుంటే చిన్నచిన్న జంతువులు అరిచినా పట్టించుకోవని, తాము కూడా చిల్లర అరుపులను పట్టించుకోబోమన్నారు.
రాష్ట్రంలో ఆకలిచావులు, ఆత్మహత్యలు ఆగిపోయాయని, అనేక విషయాల్లో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రులే స్పష్టం చేస్తున్నారన్నారు. తెలంగాణ సంపదను పెంచేందుకు, దానిని పేదలకు పంచేందుకు తాము ప్రణాళికలు, పథకాలను తెస్తున్నామన్నారు. పాలమూరు- సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ కశ్మీరం అవుతుందన్నారు.
మనిషి చంద్రుడి మీదికి వెళ్లినా దళితులు ఇప్పటికీ కఠిన పేదరికంలో ఉండటం మంచిది కాదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిరుపేదలు దళితులే. గతంలో వారికి దోచిపెట్టామని ఇతరులు అసూయపడేంత ప్రచారం చేశారు. రాష్ట్రంలో దళితులు 15శాతం ఉన్నారనుకుంటే.. వాస్తవంగా 18 నుంచి 19శాతం వరకు ఉన్నట్టు తేలింది. వారికోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామంటే విపక్ష నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నా దగ్గర ఇలాంటివి రెండు మూడు పథకాలు ఉన్నాయి.
అవి అమలైతే ప్రతిపక్షాల పని ఖతమైతుందని గతంలోనే అసెంబ్లీ వేదికగా చెప్పిన. తెలంగాణలో 24 గంటలూ విద్యుత్ ఇస్తామని జానారెడ్డితో శాసనసభలో సవాల్ చేశాను. ఆయన నమ్మలేదు. అలా చేస్తే టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని ఆయన చెప్పారు. కానీ మాట తప్పి మొన్న నాగార్జునసాగర్‌లో పోటీ చేశారు.
కొత్తలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అయోమయం నెలకొన్న స్థితిలో వెయ్యి రూపాయలు సామాజిక పింఛన్‌గా ఇచ్చాం. సీఎం కార్ల రంగు మార్చడానికి కూడా ఎంతో ఆలోచించాం. అప్పటి గవర్నర్ నరసింహన్ ఈ విషయాన్ని ప్రస్తావించి.. నన్ను పిసినారి అని కూడా అన్నారు. ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ జాగ్రత్తగా పాలన చేస్తున్నాం కాబట్టే ఈ రోజు దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగాం. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలను చూసి మహారాష్ట్రలోని 45 గ్రామాలు తమను తెలంగాణలో విలీనం చేయాలని తీర్మానించాయి కూడా.
తెలంగాణలో ఆకలిచావులు, ఆత్మహత్యలు లేవని పార్లమెంటు వేదికగా కేంద్రమంత్రి ప్రకటించారు. ఎరువులు, విత్తనాలు దొరక్క చిన్నాభిన్నమైన రైతాంగాన్ని ఆదుకునేందుకు రైతుబంధు, ఉచిత విద్యుత్, బీమాతో పాటు అనేక వసతులు కల్పించాం. కోటి ఎకరాల్లో 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి రావడంతో పాఠశాలలు, కాలేజీలను కూడా గోదాములుగా మార్చాం. పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ కాశ్మీర్ ఖండం అవుతుంది.
బట్టకు పొట్టకు చావుండదు. చిల్లర వాదనలకు అతీతంగా అన్ని వర్గాల కోసం జరుగుతున్న ప్రస్థానాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. వారికి కామన్‌సెన్స్ ఎక్కువ. ఈ ప్రస్థానాన్ని ప్రజలు కాపాడుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు కొందరు లక్ష రూపాయల జీతం వచ్చినా తల్లిదండ్రులను చూసుకోవడం లేదు. తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం. ప్రపంచంలో తల్లిదండ్రులను తప్ప దేన్నయినా కొనుక్కోగలం. మనలోనూ అలాంటి వారు ఉంటే మారాలి. తల్లిదండ్రులకు సేవ చేయనోడు దేశాన్ని బాగు చేస్తాడా? అని అన్నారు.
దళిత బంధు పథకంపై హైకోర్టులో పిల్
దళిత బంధు పథకంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుండాల్సి ఉండగా అంతకంటే ముందే అక్కడే పైలెట్ ప్రాజెక్ట్‌గా దళిత బంధు పథకాన్ని అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ముందు నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే దళిత బంధు పథకం అమలు వెనుకున్న లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీల నేతలు హైకోర్టులో (Telangana High court) పిల్ దాఖలు చేశారు. దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్, ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీని ప్రతివాదులుగా చేర్చుతూ పిటిషనర్లు ఈ పిల్ దాఖలు చేశారు.