Hyderabad, June 12: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా (Etela Rajender Resigns as MLA) చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఈటల.. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామాపత్రం సమర్పించారు. మాజీ మంత్రి ఈటల (Former TRS minister Etela Rajender) రాజీనామాను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. నేటి ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
కాగా.. నేటి సాయంత్రం ఈటల ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14న జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ (Bharatiya Janata Party) తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమ, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు. ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ముందుగా ఈటల రాజేందర్ శనివారం ఆయన అనుచరులతో కలసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని, కేసీఆర్ (CM KCR) నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమేనన్నారు. కేసీఆర్ దగ్గర రూ.వందల కోట్లు ఉన్నాయని, అధికార దుర్వినియోగం చేసి ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే తన అజెండా అని అన్నారు. హుజూరాబాద్‌లో గెలిచి ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఈటల తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామాపత్రం సమర్పించిన అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ గేట్ వద్ద తమ సహచరులను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఏనుగు రవీందర్‌రెడ్డిని కూడా అనుమతించలేదన్నారు. కేసీఆర్ వెకిలి చేష్టలు, చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని ఈటల ధ్వజమెత్తారు.
గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు
గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తూన్న మాజీ మంత్రి శ్రీ ఈటల రాజేందర్. https://t.co/RcNTr0qAqx
— Eatala Rajender (@Eatala_Rajender) June 12, 2021
BJP delegation led by Tarun Chugh visited my residence for a luncheon meeting. @tarunchughbjp @drlaxmanbjp @aruna_dk, @vivekvenkatswam, @TigerRajaSingh, @RaghunandanraoM @N_RamchanderRao and others attended. pic.twitter.com/u4y7ZY6gvy
— Eatala Rajender (@Eatala_Rajender) June 11, 2021
17 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగానని.. ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తనను రాజీనామ చేయమని ప్రజలే ఆశీర్వదించారన్నారు. తెరాస బీ ఫారం ఇచ్చి ఉండొచ్చు. కానీ గెలిపించింది ప్రజలు అని అన్నారు. అధికార దుర్వినియోగం చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కౌరవులకు, పాండవులకు యుద్ధం జరగబోతోందని ఈటల అన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని గుర్తు చేశారు. సమైక్య పాలకులపై అసెంబ్లీలో గర్జించానని చెప్పారు. కరోనాతో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
Here's Etela Rajender Resigns as MLA Letter
రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ అన్న... pic.twitter.com/K5dJKDCU5i
— D. Ramanjulu Reddy (@DRamanjuluRedd3) June 12, 2021
తెలంగాణ రాష్ట్రమే శ్రీరామ రక్ష అని కొట్లాడాం. అనేక మంది ఇతర పార్టీల్లో గెలిచి రాజీనామా చేయకుండా తెరాసలో చేరి నిన్సుగ్గుగా మంత్రులుగా కొనసాగుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరగబోతోంది. వడ్లు తడిచి మొలకలు వచ్చినా పట్టించుకోరు. యువతకు ఉపాధి లేకపోయినా స్పందించరు. కానీ నన్ను చక్రబంధంలో పెట్టాలి అని పోలీసు అధికారులను వాడుతున్నారు. నాకు నిర్బంధాలు కొత్తకాదు.. నియంత నుంచి తెలంగాణను విముక్తి కల్పించడమే నా ఎజెండా. అందరూ హుజురాబాద్ ప్రజలకు అండగా ఉండండి. మనిషిగా ప్రతి ఒక్కరినీ ఆదుకుంటానని తెలిపారు.
ఇటీవల రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటల.. వర్షాల కారణంగా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్, రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం షామీర్‌పేటలోని ఈటల నివాసానికి వెళ్లి చర్చలు జరిపిన సంగతి తెలిసిదే.